Spirit |పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘స్పిరిట్’ ఇప్పటికే సినీ ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలను సృష్టించింది. కల్ట్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాను రూపొందిస్తుండగా, ‘యానిమల్’ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన త్రిప్తి డిమ్రీ హీరోయిన్గా నటిస్తోంది. ఇటీవలే ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమవ్వగా, 2027లో విడుదలయ్యే అవకాశముందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే విడుదలైన వాయిస్ టీజర్, ప్రభాస్ ఫస్ట్ లుక్కు భారీ స్పందన రావడంతో ఈ ప్రాజెక్ట్‌పై హైప్ మరింత పెరిగింది.
టీజర్ విడుదలైనప్పటి నుంచి ‘స్పిరిట్’ సినిమాకు సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ కూడా సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతోంది. ఈ క్రమంలో తాజాగా మరో క్రేజీ న్యూస్ చర్చనీయాంశంగా మారింది. ఈ చిత్రంలో ప్రముఖ సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో నటిస్తున్నారని ముందుగా వార్తలు వచ్చాయి. అంతేకాదు వాయిస్ టీజర్లో కూడా ఆయన వాయిస్ వినిపించడంతో సినిమాలో ఆయన పాత్ర ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అభిమానులు భావించారు. అయితే ఇప్పుడు అనూహ్యంగా ‘స్పిరిట్’ ప్రాజెక్ట్ నుంచి ప్రకాష్ రాజ్ తప్పుకున్నారనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఈ విషయం పై అధికారిక ప్రకటన ఏదీ రాకపోయినా, సోషల్ మీడియా మరియు జాతీయ స్థాయి ఎంటర్టైన్మెంట్ వేదికల్లో ఈ వార్త విస్తృతంగా ప్రచారం పొందుతోంది. ఆయన ఎందుకు తప్పుకున్నారనే విషయంపై స్పష్టత లేకపోవడంతో ఆసక్తి మరింత పెరిగింది.
గతంలో ఈ సినిమా నుంచి హీరోయిన్ దీపికా పదుకొనే తప్పుకున్నారనే వార్తలు కూడా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ప్రకాష్ రాజ్ గురించిన ప్రచారం బయటకు రావడంతో మళ్లీ అదే తరహా చర్చ మొదలైంది. అయితే మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు ఈ వార్తల నిజానిజాలు తెలియవు. భారీ అంచనాలతో రూపొందుతున్న ‘స్పిరిట్’ సినిమాలో నటీనటుల మార్పులు జరుగుతాయా లేదా అన్నది తెలుసుకోవాలంటే అభిమానులు ఇంకొంత కాలం వేచి చూడాల్సిందే.