దూర్జటి విరచిత ‘శ్రీకాళహస్తీశ్వర మహత్యం’ కావ్యం ఆధారంగా మంచు విష్ణు నిర్మిస్తున్న చిత్రం ‘భక్త కన్నప్ప’. మంచు విష్ణు టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రానికి ముఖేష్‌కుమార్ సింగ్ దర్శకుడు. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ఇటీవల కాళహస్తిలో జరిగిన విష యం తెలిసిందే. ఆ సందర్భంలోనే ఈ ప్రాజెక్ట్‌లో కొంతమంది స్టార్లు కూడా భాగం కానున్నారని మంచు విష్ణు తెలిపారు. తాజాగా ఈ సినిమాకు చెందిన ఓ క్రేజీ అప్డేట్ వెలువడింది. ఈ చిత్రంలో అగ్ర హీరో ప్రభాస్ ఓ కీలక పాత్రలో నటించబోతున్నారు. ఈ విషయాన్ని మంచు విష్ణు అధికారికంగా వెల్లడించారు.
కన్నప్ప శివభక్తుడన్న విషయం తెలిసిందే. ఈ కథలో శివుడి పాత్ర కీలకం. ఆ పాత్రలో పరమశివుడిగా ప్రభాస్ నటిస్తున్నట్టు సమాచారం. వ్యక్తిగత సోషల్‌మీడియా అకౌంట్లో మంచు విష్ణు ‘హరహర మహాదేవ్’ అంటూ పోస్ట్ చేయడంతో ఈ వార్తకు మరింత బలం చేకూరినట్లయింది. ఈ సినిమాలో బాలీవుడ్ తారలు కూడా భాగం కాబోతున్నారని సమాచారం. ఈ చిత్రాన్ని న్యూజిలాండ్‌లో తెరకెక్కిస్తామని మంచు విష్ణు గతంలో ప్రకటించారు. ఈ మేరకు అక్కడ భారీ సెట్స్‌తో ఏర్పాట్లు చేస్తున్నారు.