Prabhakar | టీవీ నటుడు ప్రభాకర్ కుమారుడు చంద్రహాస్ హీరోగా రూపొందిన ‘బరాబర్ ప్రేమిస్తా’ చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే సినిమా విడుదలకు ముందు జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో చోటుచేసుకున్న ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. ఈ ఈవెంట్ సందర్భంగా చంద్రహాస్ అత్యుత్సాహంతో సినిమాలోని ఓ పాటను సొంత పదజాలంతో పాడుతూ అనుచిత పదాలు ఉపయోగించడంతో అక్కడికి హాజరైన ప్రేక్షకులతో పాటు టీవీ ఎదుట వీక్షిస్తున్నవారు కూడా షాక్‌కు గురయ్యారు.ఈ వీడియో క్షణాల్లోనే వైరల్ కావడంతో నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
ముఖ్యంగా ఓ మీడియా ప్రతినిధి ఈ విషయంపై బహిరంగంగా అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ఇలా అసభ్య పదజాలంతో పాట పాడటం తగదని, సంబంధిత వ్యక్తి తప్పనిసరిగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యలు మరింత చర్చకు దారి తీసి సోషల్ మీడియాలో వాదోపవాదాలకు కారణమయ్యాయి. ఇదే సమయంలో కొంతమంది నెటిజన్లు చంద్రహాస్ పెంపకం, కుటుంబ విలువలపై కూడా విమర్శలు చేయడం ప్రారంభించారు. ఈ పరిస్థితుల్లో శనివారం నటుడు ప్రభాకర్ స్వయంగా మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చారు. తన కుమారుడు చేసిన తప్పును అంగీకరిస్తూ అందరికీ క్షమాపణలు తెలిపారు. “మా అబ్బాయి తప్పు చేశాడు… ఆ విషయం నేను అతనికి చెప్పాను. కానీ అతని తప్పును ఎత్తిచూపే క్రమంలో కొందరు మా కుటుంబంపై అనవసర విమర్శలు చేయడం బాధ కలిగించింది. అతన్ని నేను పద్ధతిగానే పెంచాను. ఒక పదం వల్ల అతని వ్యక్తిత్వాన్ని అంచనా వేయకూడదు” అని ప్రభాకర్ భావోద్వేగంగా పేర్కొన్నారు.
అలాగే ఆ ఈవెంట్‌కు తన ఆహ్వానం మేరకు హాజరైన నటుడు జేడీ చక్రవర్తి, దర్శకుడు జయంత్ సి పరాంజీకి కూడా క్షమాపణలు తెలిపారు. “నా వల్ల వారికి మాటలు పడాల్సి రావడం బాధగా ఉంది” అని అన్నారు. ప్రస్తుతం ‘బరాబర్ ప్రేమిస్తా’ సినిమా థియేటర్లలో ప్రదర్శితమవుతోందని, తన కుమారుడి నటనకు మంచి స్పందన వస్తోందని ప్రభాకర్ చెప్పారు. ఈ వివాదంపై ప్రభాకర్ ఇచ్చిన వివరణ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒకవైపు విమర్శలు కొనసాగుతుండగా, మరోవైపు ప్రభాకర్ నిజాయితీగా క్షమాపణలు చెప్పడం సరైన నిర్ణయమని కొందరు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి చిన్న ఘటనగా మొదలైన విషయం పెద్ద చర్చగా మారి సినిమా ప్రమోషన్‌కే కేంద్రబిందువుగా నిలిచింది.