కురవి, ఆగస్టు 29 : తరాల మధ్య పేదరికం కొనసాగించడంలో బాల్య వివాహాలే ప్రధాన కారణమని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు డాక్టర్ పరికిపండ్ల అశోక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కురవి పోలీసు స్టేషన్ ఆవరణలో బాల్యవివాహాలపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండకముందు అమ్మాయికి, 21 సంవత్సరాలు నిండకముందు అబ్బాయికి వివాహం జరపడం చట్టరీత్యా నేరమని, ఎంతటి వారినైనా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
చిన్న వయసులో పెళ్లి చేసుకున్న వారిలోనే గృహహింస అధికమని, అదే విధంగా తరాల మధ్య పేదరికం కొనసాగుతుందని, మహిళలు అట్టడుగు స్థాయిలోనే మిగిలిపోతున్నారని వివరించారు. చిన్న వయసులో గర్భధారణ, కుటుంబ బాధ్యతలు వ్యక్తిగతంగా, సమాజపరంగా తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయని అన్నారు.
ఈ సందర్భంగా కురవి ఎస్ఐ గుండ్రాతి సతీష్ మాట్లాడుతూ.. శిశు మరణాలు, పురిటి మరణాలకు ప్రధాన కారణం బాల్యవివాహాలేనని గుర్తుచేశారు. బాల్య వివాహాలు అడ్డుకోవడం సమాజంలో అందరి బాధ్యత అన్నారు. సదస్సులో పోస్టర్లు ఆవిష్కరించి, పాల్గొన్న వారితో బాల్యవివాహాలు చేయనివ్వమని ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ బత్తుల వెంకటయ్య, ఉమెన్ కానిస్టేబుళ్లు అనిత, మాధవి, స్థానికులు గిరి, హుస్సేన్, లక్ష్మణ్, కోటేశ్వర తదితరులు పాల్గొన్నారు.