సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరు సొంతింటి కలను సాకారం చేసుకోవాలని తపిస్తారు. తమ అభిరుచులకు అనుగుణంగా ఇంటిని తీర్చిదిద్దుకోవాలనే భావనతో ఉంటారు. అగ్ర కథానాయిక పూజాహెగ్డే ఇటీవల ముంబయిలో ఇంటి నిర్మాణాన్ని చేపట్టింది. ఆధునిక హంగులతో విలాసవంతంగా తన కలల గృహానికి రూపకల్పన చేసుకుంటున్నానని పూజాహెగ్డే ఆనందం వ్యక్తం చేసింది. ‘నా కలల సౌధం సాకారమవుతున్నది..’ అంటూ ఇంటి ఫొటోలతో ట్విట్టర్లో ఓ పోస్ట్ చేసింది. రాబోవు కొన్ని మాసాల్లో ఆమె ముంబయిలో గృహ ప్రవేశం చేస్తుందని చెబుతున్నారు. అరంగేట్రం చేసిన అనతికాలంలోనే ఈ మంగళూరు సోయగం చిత్రసీమలో మంచి గుర్తింపును సంపాదించుకుంది. తెలుగు, తమిళంతో పాటు హిందీ భాషలో ఈ అమ్మడిని భారీ అవకాశాలు వరిస్తున్నాయి. ముంబయి కేంద్రంగా తన సినీ కార్యకలాపాల్ని నిర్వర్తించాలనే లక్ష్యంగా ఉన్న ఈ సుందరి అక్కడే గృహాన్ని కొనుగోలు చేసిందని ఆమె సన్నిహితులు అంటున్నారు.