ముంబై, అక్టోబర్ 11(నమస్తే తెలంగాణ): మహారాష్ట్ర మంత్రివర్గ సమావేశం నుంచి డిప్యూటీ సీఎం, ఎన్సీపీ అధ్యక్షుడు అజిత్ పవార్ వాకౌట్ చేశారు! గురువారం సమావేశం ప్రారంభమైన 10 నిమిషాలకే అజిత్ పవార్ సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు. దీంతో మహారాష్ట్రలోని మహాయుతి కూటమిలో విభేదాలు తారస్థాయికి చేరాయని, ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న అజిత్ పవార్ శుక్రవారం సాయంత్రం దీనిపై ఒక కీలక ప్రకటన చేస్తారని ప్రచారం జరిగింది. అయితే శుక్రవారం దీనిపై ప్రకటన చేసిన అజిత్ పవార్ ఆ వదంతులకు తెరదించారు. మరఠ్వాడా రీజియన్లోని అహ్మద్పూర్లో ఒక అత్యవసర కార్యక్రమానికి హాజరు కావాల్సి ఉన్నందునే తాను సమావేశం నుంచి బయటకు వచ్చానని ఆయన స్పష్టం చేశారు. తన అనుమతితోనే కేబినెట్లో అన్ని నిర్ణయాలు తీసుకున్నారని చెప్పారు.
నటుడు షాయాజీ షిండే ఎన్సీపీలో చేరిక
ప్రముఖ నటుడు షాయాజీ షిండే రాజకీయ రంగ ప్రవేశం చేశారు. శుక్రవారం ఆయన అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీలో చేరారు. షిండేను త్వరలో జరిగే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ప్రచారకర్తగా వినియోగించుకుంటామని పవార్ తెలిపారు. తాను పలు సినిమాలలో రాజకీయ నేతగా నటించానని, ఇప్పుడు రాజకీయ నేత అయ్యాయని, అజిత్ పవార్ శైలి, పనితీరు తనను ఆకర్షించి ఈ పార్టీలో చేరానని షిండే తెలిపారు.