Bhogapuram Airport | ఆంధ్రప్రదేశ్‌లోని భోగాపురంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించారు. అనంతరం జాతికి అంకితం చేశారు. రాష్ట్ర విభజన అనంతరం నిర్మితమైన తొలి అంతర్జాతీయ విమానాశ్రయంగా గుర్తింపు పొందిన ఈ ప్రాజెక్టు ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలక మైలురాయిగా నిలవనుందని భావిస్తున్నారు.
ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు, కేంద్ర సహాయ మంత్రులు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు, జీఎంఆర్ గ్రూపు ఛైర్మన్ జి. మల్లిఖార్జునరావు, బిజినెస్ ఛైర్మన్ జీబీఎస్ రాజు తదితరులు పాల్గొన్నారు.
ప్రారంభోత్సవం సందర్భంగా విమానాశ్రయంలోని ప్రయాణికుల టెర్మినల్‌ను సీఎం చంద్రబాబుతో కలిసి ప్రధాని మోదీ సందర్శించి ఆధునిక సదుపాయాలను పరిశీలించారు. చెక్-ఇన్ హాల్, సాంకేతిక వ్యవస్థలు, టెర్మినల్ రూపకల్పన, ప్రయాణికులకు కల్పించిన వసతులపై జీఎంఆర్ ప్రతినిధులు ఆయనకు వివరించారు.
ప్రధాని రాక సందర్భంగా గిరిజన సంస్కృతిని ప్రతిబింబించే థింసా నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, పోలవరం ప్రాంతాల నుంచి వచ్చిన గిరిజన మహిళలు, విద్యార్థినులు, మహిళా సంఘాల సభ్యులు కలిపి 13,750 మంది కళాకారులు ఒకేసారి థింసా నృత్యం ప్రదర్శించి ప్రధానికి ఘన స్వాగతం పలికారు. ఓపెన్ టాప్ జీపులో సభా వేదికకు వెళ్తూ ప్రధాని ఈ ప్రదర్శనను తిలకించారు.

Bhogapuram
భోగాపురం విమానాశ్రయం ప్రారంభంతో ఉత్తరాంధ్రలో పారిశ్రామిక, పర్యాటక, వాణిజ్య, ఎగుమతుల రంగాలకు కొత్త ఊపు లభించనుంది. ముఖ్యంగా ఫార్మా, ఆక్వా, సముద్ర ఉత్పత్తుల ఎగుమతులకు ఈ విమానాశ్రయం కీలక కేంద్రంగా మారనుంది. ప్రత్యక్షంగా 15 వేల మందికి, పరోక్షంగా 5.85 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు అంచనా.
రూ.4,750 కోట్ల వ్యయంతో 2,203 ఎకరాల విస్తీర్ణంలో ఈ విమానాశ్రయాన్ని నిర్మించారు. తొలి దశలో ఏడాదికి 60 లక్షల మంది ప్రయాణికులకు సేవలందించే సామర్థ్యం ఉండగా, రెండో దశలో 1.20 కోట్లు, మూడో దశలో 1.80 కోట్ల మంది ప్రయాణికులకు సేవలందించేలా విస్తరించనున్నారు.
భారీ ఎయిర్‌బస్, బోయింగ్ విమానాలు దిగేందుకు 3.8 కిలోమీటర్ల పొడవు, 45 మీటర్ల వెడల్పుతో రెండు రన్వేలు నిర్మించారు. 25 వేల టన్నుల వార్షిక సామర్థ్యంతో కార్గో టెర్మినల్, లాజిస్టిక్స్ జోన్, 55 మీటర్ల ఎత్తులో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్, 25 ఎకరాల్లో విమానాల మరమ్మతుల (ఎంఆర్వో) కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
సముద్ర తీర ప్రాంతానికి అనుగుణంగా ఎగిరే చేప ఆకృతిలో టెర్మినల్‌ను రూపకల్పన చేశారు. టెర్మినల్ సీలింగ్‌పై సంప్రదాయ ముగ్గులు, నాదస్వరం థీమ్‌లతో అలంకరించారు. స్వాగత ద్వారం వద్ద ఏటికొప్పాక బొమ్మను ఏర్పాటు చేయగా, లోపల తోలుబొమ్మలాట, బొబ్బిలి వీణ, బంగినపల్లి మామిడి, అరసవల్లి, శ్రీకూర్మం, సింహాచలం, కనకమహాలక్ష్మి ఆలయం, థింసా నృత్యం వంటి ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించే కళాఖండాలతో టెర్మినల్‌ను తీర్చిదిద్దారు.
నిర్మాణ వ్యయం: రూ.4,750 కోట్లు
విస్తీర్ణం: 2,203 ఎకరాలు
రెండు రన్వేలు (3.8 కి.మీ పొడవు)
ప్రయాణికుల టెర్మినల్ విస్తీర్ణం: 79 వేల చ.మీ.
కార్గో సామర్థ్యం: ఏటా 25 వేల టన్నులు
ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్ ఎత్తు: 55 మీటర్లు
చెక్-ఇన్ కౌంటర్లు: 40
ఇమిగ్రేషన్ కౌంటర్లు: 10
బ్యాగేజ్ బెల్ట్‌లు: దేశీయ – 5, అంతర్జాతీయ – 2
సెల్ఫ్ చెక్-ఇన్, బ్యాగేజ్ రీక్లెయిమ్ సదుపాయాలు
ప్రత్యక్ష ఉపాధి: 15 వేల మందికి
పరోక్ష ఉపాధి: 5.85 లక్షల మందికి