న్యూఢిల్లీ: సంగీత దర్శకుడు, గాయకుడు బప్పి లహిరి మృతిపట్ల ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. ఆయన సంగీతం వైవిధ్యమైన భావోద్వేగాలను అందంగా వ్యక్తికరించిందని, అన్ని తరాలవారిని అలరించిందని ప్రధాని అన్నారు. ఆయన మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. బప్పి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
సంగీత దర్శకుడు బప్పి లహిరి బుధవారం ఉదయం కన్నుమూశారు. గత కొద్ది కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ముంబైలోని దవాఖానలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
బప్పి లహిరి 1952, నవంబర్ 27న బెంగాల్లోని జల్పాయ్గురిలో జన్మించారు. ఆయన హిందీతోపాటు తెలుగు, తమిళ, కన్నడ, గుజరాతీ, బెంగాలీ భాషల్లో సంగీతం అందించారు. 2014లో భారతీయ జనతా పార్టీ (BJP)లో చేరిన ఆయన అదేఏడాది జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో బెంగాల్ నుంచి ఎంపీగా పోటీచేశారు.
బప్పి లహిరి తెలుగులో కూడా ఎన్నో విజయవంతమైన చిత్రాలకు సంగీత దర్శకుడిగా పనిచేశారు. సింహాసనం, స్టేట్ రౌడీ, సామ్రాట్, గ్యాంగ్ లీడర్, రౌడీగారిపెళ్లాం, దొంగ పోలీసు, బ్రహ్మ, నిప్పురవ్వ, బిగ్బాస్, ఖైదీ ఇన్స్పెక్టర్ వంటి విజయవంతమైన చిత్రాలకు ఆయన మ్యూజిక్ అందిచారు. తెలుగులో ఇటీవల డిస్కోరాజా చిత్రంలో కూడా పాటపడారు. కాగా, హిందీలో 2020లో విడుదలైన బాఘీ 3 సినిమాలో తన చివరి పాట పాడారు.