హిమాయత్‌నగర్, నవంబర్ 17: ఆ విద్యార్థిని చదువులో టాప్.. పదో తరగతిలో 8.3, ఇంటర్లో 864, నీట్లో మంచి ర్యాంక్.. ఫిలిప్పీన్స్‌లో ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీలో ఎంబీబీఎస్ సీటు కూడా వచ్చింది. పేద కుటుంబమైనా, ఆమె తల్లిదండ్రులు కష్టపడి చదివించారు. బిడ్డకు విదేశాల్లో ఎంబీబీఎస్ చేసే అవకాశం రావటంతో అష్టకష్టాలు పడి బ్యాంక్ లోన్ తీసుకొని ఆమెను జాయిన్ చేశారు. కానీ ఆ డబ్బంతా ఫస్టియర్కే సరిపోయింది. పై తరగతులు చదివించే స్థోమత లేక తల్లిదండ్రులు, వాళ్లను ఇబ్బందిపెట్టలేక ఆ విద్యార్థిని చదువును మధ్యలోనే ఆపేసే పరిస్థితి ఎదురైంది.
హైదరాబాద్‌లోని విద్యానగర్ టీఆర్టీ క్వార్టర్స్‌లో ఉండే తట్టా సుధాకర్, మహేశ్వరి దంపతులది పేద కుటుంబం. వారి కూతురు శ్రావణి చదువులో ఫస్ట్. ఇంటర్ ప్రభుత్వ కాలేజీలో చదివి మంచి మార్కులు తెచ్చుకొన్నది. ఫిలిప్పీన్స్‌లోని సౌత్ వెస్టర్న్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ సీటు సంపాదించింది. తమ బిడ్డ బాగా చదువుకోవాలని లోన్ తీసుకొని ఫీజు కట్టారు. ఆర్థిక పరిస్థితుల కారణంగా ఆన్లైన్ ద్వారా ఇంటినుంచే మొదటి సంవత్సరం చదివేందుకు యూనివర్సిటీ అనుమతి ఇచ్చింది. తొలి సంవత్సరం పరీక్షల్లో ఉన్నత శ్రేణిలో పాసైంది. కానీ, రెండో సంవత్సరానికి కావాల్సిన ఫీజు లేకపోవటంతో దాతల కోసం ఎదురుచూస్తున్నది. ఫిలిప్పీన్స్‌లో ఐదేండ్ల ఎంబీబీఎస్ పూర్తి చేయాలంటే దాదాపు రూ.50 లక్షలు ఖర్చు అవుతాయని, తొలి ఏడాదికే రూ.10 లక్షల ఖర్చు వచ్చిందని శ్రావణి చెప్పింది. కోర్సు పూర్తి చేయటానికి తన వద్ద డబ్బు లేదని, దాతలు ఆర్థికంగా ఆదుకొంటే వైద్యవిద్యను పూర్తి చేస్తానని వేడుకొంటున్నది.