మలేషియాలోని కౌలాలంపూర్లో ఇటీవల జరిగిన తెలంగాణ ఆవిర్భావ వేడుకలు విజయవంతంగా జరిగాయని గ్లోబల్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాలా ( Mahesh Bigala ) అన్నారు. ఈ వేడుకలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరై బీఆర్ఎస్ ఎన్ఆర్ఐలను ఎంతగానో ఉత్సాహపరిచారని పేర్కొన్నారు.
దక్షిణాఫ్రికా ( South Africa ) శాఖ బీఆర్ఎస్ ఎన్నారై బృందం గురువారం మహేష్ బిగాలను మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, ప్రవాస తెలంగాణ వాసుల సంక్షేమం, ఎన్నారై విభాగం భవిష్యత్ కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు.
గత 8 సంవత్సరాలుగా నాగరాజు గుర్రాల ఆధ్వర్యంలో దక్షిణాఫ్రికా శాఖ ఐక్యంగా పనిచేస్తూ పార్టీ కార్యక్రమాలు, సామాజిక సేవా కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తోందని అభినందించారు. దక్షిణాఫ్రికాలో మాత్రమే కాకుండా తెలంగాణలో కూడా అనేక సేవా, దాతృత్వ కార్యక్రమాలు నిర్వహిస్తూ అవసరంలో ఉన్నవారికి అండగా నిలుస్తున్నారని కొనియాడారు.
ఆఫ్రికా ఖండంలో, ముఖ్యంగా దక్షిణాఫ్రికాలో కేటీఆర్ కార్యక్రమాన్ని అత్యంత విజయవం తంగా నిర్వహించేందుకు పలు సూచనలు, సలహాలు అందించారు. ఈ కార్యక్రమాన్ని అంతర్జాతీయ స్థాయిలో ఘనంగా నిర్వహించాలని సలహా ఇచ్చారు. ఈ సమావేశంలో దక్షిణాఫ్రికా శాఖ సభ్యులు నరేందర్ మేడసాని, విష్ణు జైగుండా, శ్రీనివాస్ రేపాల పాల్గొన్నారు.