హైదరాబాద్, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ): ‘దేశ ఆర్థిక ప్రగతికి అద్భుతమైన సాధనాలుగా ఉన్న ప్రభుత్వరంగ బ్యాంకులను ప్రైవేటీకరించడం వినాశకరం’ అని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌చైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్ పేర్కొన్నారు. బ్యాంకుల ప్రైవేటీకరణను టీఆర్ఎస్ వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు. ఆ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెడితే తమ పార్టీ ఎంపీలు అడ్డుకుంటారని వెల్లడించారు.
ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న ఉద్యోగులకు సంఘీభావం తెలిపారు. బ్యాంకుల ప్రైవేటీకరణ బిల్లు ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ బ్యాంకు ఉద్యోగులు చేపట్టిన రెండురోజుల దేశవ్యాప్త సమ్మెలో భాగంగా మొదటిరోజు గురువారం రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు వివిధ రూపాల్లో ఆందోళనలు నిర్వహించారు. హైదరాబాద్‌లోని కోఠి సెంట్రల్ బ్యాంక్ అఫ్ ఇండియా ఆవరణలో యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో ఉద్యోగులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని మోదీకి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వినోద్‌కుమార్ మాట్లాడుతూ కొంతమంది కార్పొరేట్ల కోసమే ప్రభుత్వరంగ బ్యాంకింగ్ వ్యవస్థను నిర్వీర్యం చేయడానికి కేంద్రం పూనుకొన్నదని విమర్శించారు. బ్యాంకుల జాతీయీకరణ ఫలితంగా మారుమూల ప్రాంతాల్లో రైతులకు, సామాన్యులకు ఆర్థిక ప్రయోజనాలు అందుతున్నాయని గుర్తుచేశారు. ఇప్పటికే దేశంలోని అనేక ప్రైవేట్ బ్యాంకులు కుప్పకూలిపోయాయని, వాటి యాజమాన్యాలు కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచుకున్నాయని చెప్పారు.
ఆర్థిక నేరగాళ్లకు అప్పగిస్తారా?: నాగేశ్వర్
బ్యాంకులకు భారీ స్థాయిలో మొండి బకాయిలు ఉన్న ఆర్థిక నేరగాళ్లకు శిక్షలు వేయకుండా వారికే ప్రభుత్వరంగ బ్యాంకులను అప్పగించడం ఏమిటని మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ ప్రశ్నించారు. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉన్న ప్రభుత్వరంగ బ్యాంకింగ్ వ్యవస్థను ప్రైవేటీకరించడం సిగ్గుచేటన్నారు. ప్రైవేట్ బ్యాంకులు బడా కార్పొరేట్లకే తమ సేవలందిస్తాయని, ప్రభుత్వరంగ బ్యాంకులు మాత్రమే సామాన్యులు, పేదలు, వ్యవసాయం, చిన్న తరహా రంగాలు మొదలైన వారికి రుణాలు ఇచ్చి ఆదుకుంటాయని పేర్కొన్నారు.
మొండి బకాయిలన్నీ కార్పొరేట్లవే:రాంబాబు
జాతీయ బ్యాంకుల ప్రైవేటీకరణ దుర్మార్గమైన ఆలోచన అని యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ కన్వీనర్, ఏఐబీఈఏ జాతీయ కార్యదర్శి బీఎస్ రాంబాబు విమర్శించారు. ప్రభుత్వరంగ బ్యాంకులు ఎదురొంటున్న ఏకైక సమస్య మొండి బకాయిలు అని, ఆ బకాయిలు కార్పొరేట్లు, ధనిక పారిశ్రామికవేత్తలవేనని చెప్పారు. వారిపై చర్యలు తీసుకోకుండా కేంద్రం జాతీయ బ్యాంకులను ప్రైవేటీకరించి, తిరిగి వారికే అప్పగించాలని చూస్తున్నదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పలు బ్యాంక్‌ల ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
పలుచోట్ల నిరసనలు, ర్యాలీలు
బ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రాష్ట్రంలో పలుచోట్ల బ్యాంకు ఉద్యోగులు నిరసనలు, ర్యాలీలు నిర్వహించారు. యూఎఫ్‌బీయూ వరంగల్ యూనియన్ ఆధ్వర్యంలో హనుమకొండలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద ఆందోళన నిర్వహించారు. యూఎఫ్‌బీయూ పిలుపుమేరకు ఖమ్మంలోని ఎస్బీఐ ప్రధాన కార్యాలయం, కొత్తగూడెంలోని సూపర్‌బజార్ ఎస్బీఐ బ్రాంచ్ ఎదుట ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. నల్లగొండ, మిర్యాలగూడ, కోదాడ, సూర్యాపేట, భువనగిరి, చౌటుప్పల్, నకిరేకల్, దేవరకొండ తదితర కేంద్రాల్లో ఉద్యోగులు విధులు బహిష్కరించారు.