టొరంటో, ఫిబ్రవరి 18 : కెనడాలోని టొరంటో విమానాశ్రయంలో డెల్టా ఎయిర్‌లైన్స్ జెట్ బోల్తా పడింది. ల్యాండింగ్ అవుతున్న సమయంలో మంచుతో కూడిన రన్‌వేపై అదుపుతప్పి పల్టీకొట్టింది. విమానంలోని 80 మంది ప్రయాణికులు స్వల్ప గాయాలతో బతికి బయటపడ్డారని విమానాశ్రయ ముఖ్య కార్య నిర్వహణాధికారి తెలిపారు. గంటకు 65 కి.మీ వేగంతో మంచుతో కూడిన గాలులు బలంగా వీయడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమిక విచారణలో తేలింది. ‘అకస్మాత్తుగా ప్రతిదీ పక్కకు జరిగిపోయింది. రెప్పపాటు కాలంలో నేను తలకిందులుగా చిక్కుకుపోయాను’ అని పీటర్ కార్ల్సన్ అనే ప్రయాణికుడు పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన కొద్ది సేపటికే అత్యవసర సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గత మూడు వారాల్లో ఉత్తర అమెరికాలో జరిగిన నాలుగో అతి పెద్ద విమాన ప్రమాదం ఇది.