హైదరాబాద్, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ): సినిమాల్లో 14 ఏండ్లలోపు బాలలు నటించాలంటే జిల్లా కలెక్టర్ నుంచి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని కార్మికశాఖ తెలిపింది. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎవరైనా బాల కార్మికులతో పని చేయిస్తే టోల్ ఫ్రీ నంబర్ 1098కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని కోరింది. ఆన్లైన్లో కూడా ఫిర్యాదు చేయవచ్చని పేర్కొంది. చైల్డ్ ఆర్టిస్టులు సినిమాల్లో నటించాల్సిన అవసరం ఉందంటే సినిమా నిర్మాత, దర్శకుడు ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని, సినిమాల్లో నటించడానికి బాలనటుల అంగీకారం కూడా తప్పనిసరి అని తెలిపింది. బాల నటులకు ఇచ్చే రెమ్యూనరేషన్లో 25 శాతాన్ని ముందుగానే ఏదైనా జాతీయ బ్యాంకులో సంబంధిత సినిమా నిర్మాత డిపాజిట్ చేయాలని ఆదేశించింది.
14 ఏండ్లలోపు బాలలతో పనిచేయిస్తే ఏడాది జైలు శిక్షతో పాటు రూ. 20 నుంచి రూ.50 వేల వరకు జరిమానా విధిస్తారని, పనికి పంపించిన తల్లిదండ్రులు కూడా శిక్షార్హులేనని స్పష్టంచేసింది. విద్యార్థులు ఏ పాఠశాలల్లో అయినా వరుసగా 30 రోజులు హాజరు కాకపోతే ఆ పాఠశాల యజమాన్యం నోడల్ ఆఫీసర్‌కు సమాచారం అందించాలని కోరింది. బాలకార్మికులను గుర్తించేందుకు జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసినట్టు తెలిపింది. ఈ కమిటీ చైర్మన్‌గా జిల్లా కలెక్టర్, సభ్యులుగా కార్మిక, విద్య, సాంఘిక, గిరిజన సంక్షేమశాఖల అధికారులు ఉంటారని ఉత్తర్వులో పేర్కొన్నది.