మంచిర్యాల, సెప్టెంబర్ 16(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : చెన్నూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వివేక్ వ్యవహరిస్తున్న తీరును ప్రజానీకం చీదరించుకుంటున్నది. ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి సమస్యలు పట్టించుకోకపోవడంతో ఆయనపై రోజు రోజుకూ వ్యతిరేకత పెరుగుతున్నది. ఏ గ్రామానికి వెళ్లినా ప్రజలు సమస్యలపై నిలదీస్తున్నారు. ఇటు కాంగ్రెస్ పార్టీలోనూ ప్రాధాన్యం తగ్గుతున్నది. ఇటీవల నియోజకవర్గంలో ఇద్దరు రాష్ట్ర మంత్రుల పర్యటన ఖరారై.. చివరి నిమిషంలో రద్దుకావడం ఇందుకు బలం చేకూరుస్తున్నది. ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత సమస్యలు తెలుసుకునేందుకు ప్రజలతో మమేకమైంది లేదు. ఏదో మొక్కబడిగా చుట్టుపు చూపుగా గ్రామాల్లో పర్యటించడం.. కనీసం కారులో నుంచి కింద అడుగుపెట్టకుండా.. సమస్యలు వినకుండా వెళ్లిపోతుండడంతో ప్రజల్లో అసహనం వ్యక్తమవుతున్నది.
ఆగస్టు 7న కోటపల్లి మండలం కొల్లూరు గ్రామానికి ఎమ్మెల్యే వివేక్ రాగా, ‘మా ఊరిలో రోడ్లు సక్కగా లేవు. డ్రైనేజీలు లేక మురుగు నీరు రోడ్లపై పారుతుంది. జర్వాలు వచ్చి చస్తున్నా పట్టించుకుంటలేరు. సారూ… మీరు ఇప్పుడా వచ్చేది’ అంటూ గ్రామస్తులు నిలదీసిన విషయం విదితమే. అన్ని సమస్యలు పరిష్కరిస్తానంటూ హడావుడిగా వాహనంలో బయలుదేరిన ఆయనను మహిళలు అడ్డుకొని మరీ ప్రశ్నల వర్షం కురిపించారు. అలాగే సెప్టెంబర్ 6న చెన్నూర్ మండలం సుద్దాల గ్రామంలో పర్యటించగా అక్కడా గ్రామస్తులు సమస్యలపై ఎమ్మెల్యే వివేక్‌ను నిలదీశారు. గెలిచి తొమ్మిది నెలలు అవుతుందని, ఏ ఒక్క సమస్యనైనా పరిష్కరించారా అంటూ ప్రశ్నించారు. ‘మీరు ఎంపీగా ఉన్నప్పుడు సుద్దాల వాగుపై బ్రిడ్జి నిర్మిస్తానని చెబితిరి.. ఆపై ఆ హామీని మరచిపోతిరి.
చివరికి బాల్క సుమన్ ఎమ్మెల్యే అయ్యాక సుద్దాల వాగుపై బ్రిడ్జి నిర్మించారు.’ అంటూ ఆయనకు వివరించారు. గ్రామంలో విద్యుత్ సమస్యలు ఉన్నాయని, ట్రాన్స్ఫార్మర్ల వద్ద రక్షణ లేకపోతుండడంతో పశువులు విద్యుత్ షాక్‌కు గురై చనిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఏ గ్రామానికి వెళ్లినా.. అక్కడి కాలనీలు తిరిగింది లేదు. సమస్యలు తెలుసుకున్నది లేదు. కారు దిగకుండా ఏదో వచ్చామా.. పోయామా అన్నట్లు పర్యటనలు చేస్తుండడంపై ప్రజలు మండిపడుతున్నారు. ఇక ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో కొన్ని గ్రామాల్లో ఆయన పర్యటించగా, రైతులు రుణ మాఫీపై ప్రశ్నించారు. ఎన్నికలప్పుడు అందరికీ రూ. 2 లక్షలు రుణ మాఫీ చేస్తామని చెప్పిన్రు. గెలిచినంక ఏవేవో కొర్రీలు పెట్టి గోస పెట్టుకుంటున్నరు.
ఇది మీకు న్యాయమా అంటూ రైతులు నిలదీశారు. కొన్ని గ్రామాల్లో తమకు రూ.500 గ్యాస్ సిలిండర్ రావడం లేదని ప్రశ్నించారు. ఇలా నియోజకవర్గంలో ఎమ్మెల్యే వివేక్‌పై ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను తెలుసుకున్న కాంగ్రెస్ అధిష్టానం పార్టీలో ప్రాధన్యతను తగ్గించిందన్న చర్చనడుస్తున్నది. అందుకే చెన్నూర్‌లోని శివలింగాపూర్ వద్ద సింగరేణి ఏర్పాటు చేసిన సోలార్ పవర్ ప్లాంట్, జైపూర్ సింగరేణి విద్యుత్ కేంద్రంలోని అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలకు ఆగస్టు 31న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పర్యటన ఖరారై.. చివరి నిమిషంలో రద్దు అయ్యింది. అదే రోజున పెద్దపల్లి జిల్లాతో పాటు మంచిర్యాల జిల్లాలోని చెన్నూర్ నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్కమార్క పర్యటించాల్సి ఉంది.
అయితే పెద్దపల్లి జిల్లాలో మాత్రమే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పర్యటించి, చెన్నూర్‌కు రాకుండానే వెళ్ల్లిపోయారు. అలాగే ఈ నెల 6న మంత్రి సీతక్క చెన్నూర్ పర్యటన ఖరారు కాగా, ఆమె పర్యటన కూడా రద్దు అయ్యింది. చెన్నూర్ పట్టణంలో అమృత్ పథకంలో భాగంగా రూ .31 కోట్లతో నిర్మించే వాటర్ ట్యాంకు నిర్మాణానికి మంత్రి సీతక్క శంకుస్థాపన చేయాల్సి ఉంది. అయితే మంత్రి సీతక్క పర్యటన చివరి నిమిషంలో రద్దుకావడంతో తండ్రీ కొడుకులైన ఎమ్మెల్యే వివేక్, ఎంపీ వంశీలే వాటర్ ట్యాంకు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఒకవైపు ఇదిలా ఉంటే మారో వైపు నియోజకవర్గంలోని పార్టీలో నాయకుల మధ్య గొడవలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి.
గ్రూపు రాజకీయాలు నడుస్తున్నాయి. చెన్నూర్‌లో అమృత్ పథకంలో వాటర్ ట్యాంకు శంకుస్థాపన చేసిన అనంతరం తండ్రీ కొడుకులు ఓ వైపు సమావేశం నిర్వహిస్తుండగానే.. పక్కన కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు పెద్ద నాయకులు గొడవపడ్డారు. పార్టీ కార్యక్రమానికి ఖర్చుపెట్టిన డబ్బుల విషయంలో చెన్నూర్ పట్టణానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు మూల రాజిరెడ్డి, భీమారం మండలానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు చేకూర్తి సత్యనారాయణ రెడ్డి ఘర్షణ పడ్డారు. ఇదంతా అక్కడున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల ముందే జరిగింది. అయితే తమకు సంబంధం లేదనట్లుగా ఎమ్మెల్యే వివేక్, ఎంపీ వంశీ కార్యక్రమం ముగించుకుని అక్కడి నుంచి జారుకున్నారు. ఇలా రోజురోజుకూ ఎమ్మెల్యే వివేక్‌పై, కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరగుతుండడం, నాయకులు మధ్య గూపు తగాదాలు జరుగుతుండడంతో తమ భవిష్యత్‌పై కింది స్థాయి నాయకులు, కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.