బోథ్, మార్చి 15 : అదో మారుమూల గిరిజన గ్రామం. ఒకటి నుంచి ఐదు తరగతుల్లో 36 మంది విద్యార్థులు ఉన్నారు. ఒక్కడే ఉపాధ్యాయుడు ఉండడంతో బోధన ఇబ్బందిగా మారింది. ఈ తరుణంలో పెందూర్ సరస్వతి పాఠాలు చెప్పడానికి స్వచ్ఛందంగా ముందుకొచ్చింది. బోథ్ మండలంలోని అందూర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు పని చేసేవారు. గత జనవరి 3న ఇక్కడ పని చేస్తున్న నారాయణ అనే ఉపాధ్యాయుడు అనారోగ్యంతో చనిపోయాడు.
మిగిలిన ఒక్క ఉపాధ్యాయుడు ఐదు తరగతులకు పాఠాలు చెప్పడం ఇబ్బందిగా మారింది. నెలవారి సమావేశాలు, క్లస్టర్ సమావేశాలకు వెళ్లి నివేదికలు ఇవ్వడం, అత్యవసర సమయాల్లో సెలవు పెడుతుండడంతో పాఠశాల మూసి ఉండే పరిస్థితి ఏర్పడింది. ఈ తరుణంలో గ్రామ సర్పంచ్ పెందూర్ పృథ్వి భార్య పెందూర్ పుష్పలత పాఠాలు చెప్పేందుకు ముందుకొచ్చింది. ఇంటర్మీడియట్‌తోపాటు టీటీసీ పూర్తి చేసి అనుభవం ఉండడంతో తాను స్వచ్ఛందంగా పాఠాలు చెబుతున్నానని తెలిపింది.