Peddi | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. గ్రామీణ క్రీడల నేపథ్యంతో రూపొందిన ఈ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. థియేటర్లలో సూపర్ హిట్‌గా నిలిచిన ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ‘పెద్ది’ ఓటీటీ విడుదల కోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న అభిమానులకు మేకర్స్ శుభవార్త చెప్పారు. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ తేదీని అధికారికంగా ప్రకటించింది. జూలై 9 నుంచి ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి రానుంది.
తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో కూడా ఒకేసారి స్ట్రీమింగ్ చేయనున్నట్లు నెట్‌ఫ్లిక్స్ వెల్లడించింది. దీంతో థియేటర్లలో మిస్ అయిన ప్రేక్షకులు ఇంట్లోనే ఈ చిత్రాన్ని ఆస్వాదించే అవకాశం దక్కనుంది. విడుదలైన తొలి రోజు నుంచే ‘పెద్ది’కి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. గ్రామీణ నేపథ్యంలో స్పోర్ట్స్, ఎమోషన్, ఫ్యామిలీ డ్రామా అంశాలను సమతుల్యంగా మిళితం చేసిన బుచ్చిబాబు కథనం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా రామ్ చరణ్ నటన, పాత్రలోని తీవ్రత, భావోద్వేగ సన్నివేశాలు సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి ఈ చిత్రం రామ్ చరణ్ కెరీర్లో మరో భారీ విజయంగా నిలిచింది.
ఈ చిత్రంలో బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ కథానాయికగా నటించి తన నటనతో ప్రశంసలు అందుకుంది. అలాగే దివ్యేందు, బొమన్ ఇరానీ, జగపతిబాబు, రవికిషన్ తదితరులు కీలక పాత్రల్లో మెప్పించారు. ప్రతి పాత్ర కథకు బలం చేకూర్చేలా దర్శకుడు తీర్చిదిద్దిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంది. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు, ఇషాన్ సక్సేనా ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. అత్యున్నత నిర్మాణ విలువలు, అద్భుతమైన విజువల్స్, సంగీతం, ఎమోషనల్ కథనం కలిసి ‘పెద్ది’ని ఈ ఏడాది అతిపెద్ద విజయాల్లో ఒకటిగా నిలబెట్టాయి.థియేటర్లలో ఘనవిజయం సాధించిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో కూడా అదే స్థాయి ఆదరణ దక్కించుకుంటుందా అన్నది ఆసక్తికరంగా మారింది.