హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ)/బంజారాహిల్స్: పక్షులు, ముఖ్యంగా పిచ్చుకలు మన జీవన విధానంలో భాగంగా కొనసాగాయని, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉన్నదని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్) ఆర్ఎం డోబ్రియల్ అన్నారు. ఆదివారం హైదరాబాద్లోని కాసు బ్రహ్మానందరెడ్డి జాతీయ ఉద్యానవనం (కేబీఆర్ పార్క్)లో ప్రపంచ పిచ్చుకల దినోత్సవ వేడుకలు నిర్వహించారు. పిట్టగూళ్లను పంపిణీ చేశారు. విద్యార్థులకు డ్రాయింగ్, స్లోగన్స్ తయారీ, సిగ్నేచర్ క్యాంపెయిన్ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు.
ఈ సందర్భంగా డోబ్రియల్ మాట్లాడుతూ.. బాల్యంలో పిచ్చుకలతో ఆడుకున్న మధుర స్మృతులను గుర్తుచేసుకొన్నారు. హరితహారం ద్వారా రాష్ట్రంలో పర్యావరణం మెరుగుపడిందని, జంతువులు, పక్షి జాతుల సంచారం పెరిగిందని పక్షి ప్రేమికులు పేర్కొన్నారు. కార్యక్రమంలో హైదరాబాద్ చీఫ్ కన్జర్వేటర్ ఎంజే అక్బర్, జిల్లా అటవీశాఖ అధికారి ఎం జోజి, బర్డింగ్పాల్స్, డెక్కన్ బర్డర్స్, నేచర్ లవర్స్ సొసైటీ ప్రతినిధులు, విద్యార్థులు, పార్క్ సిబ్బంది, వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.