భారతీయ చలనచిత్ర దర్శకురాలు పాయల్ కపాడియాకి అరుదైన గౌరవం లభించింది. ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2025 జ్యూరీలో పాయల్ చోటు దక్కించుకున్నారు. గతేడాది పాయల్ దర్శకత్వంలో వచ్చిన ‘ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్స అనే చిత్రం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో గ్రాండ్ పిక్స్ అవార్డు గెలుచుకున్న విషయం తెలిసిందే. ముంబై, కొంకణ్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రం మహిళా స్నేహం, ప్రేమ ఆకాంక్షల గురించి రూపొందించబడింది. ఈ సినిమా విడుదలై ప్రశంసలు అందుకోవడమే కాకుండా.. 30 సంవత్సరాల తర్వాత కేన్స్ ఫెస్టివల్లో నిలిచిన మొదటి భారతీయ చిత్రంగా చరిత్ర సృష్టించింది.
అయితే తాజాగా పాయల్ కపాడియా జ్యూరీ మెంబర్‌గా చోటు దక్కించుకుంది. ఈ వేడుకలో ఫిల్మ్ ఫెస్టివల్ జ్యూరీ అధ్యక్షురాలిగా ఫ్రెంచ్ నటి జూలియెట్ బినోష్ వ్యవహరించనుండగా.. జ్యూరీలో పాయల్‌తో పాటు హాలీవుడ్ నటి హాలీ బెర్రీ, ఇటాలియన్ నటి ఆల్బా రోర్వాచర్, కొరియన్ దర్శకుడు హాంగ్ సాంగ్సూ, కాంగోలీస్ దర్శకుడు డైయెడో హమాడి, మెక్సికన్ దర్శకుడు కార్లోస్ రేగాడాస్, ఫ్రెంచ్-మొరాకన్ రచయిత్రి లీలా స్లిమాని కూడా సభ్యులుగా చోటు దక్కించుకున్నారు.
గతేడాది దర్శకురాలిగా ఎంట్రీ ఇచ్చిన పాయల్ ఈసారి జ్యూరీ సభ్యురాలిగా కేన్స్‌లో భారతీయ సినిమాకు ప్రాతినిధ్యం వహించనుంది. ఈ చలనచిత్రోత్సవం మే 13 నుంచి 24 వరకు ఫ్రాన్స్‌లోని కేన్స్‌లో జరగనుంది.