న్యూఢిల్లీ, అక్టోబర్ 27: ఇకపై టిక్కెట్లను నగదుతో కొనే ఎయిర్ ఇండియా విమానాల్లో ఎక్కాలని అన్ని శాఖలు, మంత్రులకు బుధవారం కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అంతేగాక ఇప్పటిదాకా ఎయిర్ ఇండియాకు ఇవ్వాల్సిన బాకీలనూ వెంటనే తీర్చేయాలని ఆదేశించింది. పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాను ఇటీవలే టాటా గ్రూప్ రూ.18,000 కోట్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలోని వ్యయ విభాగం ఈ విధంగా ఓ తాజా ప్రకటన విడుదల చేసింది. ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ జరుగుతున్నందున టిక్కెట్లపై రుణ సదుపాయాన్ని సంస్థ ఆపేసిందని పేర్కొన్నది. కాబట్టి తదుపరి ఆదేశాలు వచ్చేదాకా అన్ని మంత్రిత్వ శాఖలు, సంబంధిత అధికారులు నగదు చెల్లించే టిక్కెట్లను కొని ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణించాల్సి రావచ్చని తెలిపింది. ఆయా శాఖలు తమ కిందిస్థాయి విభాగాలకూ ఈ సమాచారాన్ని అందించాలన్నది. ఇక ఈ ప్రయాణ ఖర్చుల్ని భారత ప్రభుత్వమే భరిస్తుందన్న ఆర్థిక మంత్రిత్వ శాఖ.. అధికారులు ఎయిర్ ఇండి యా విమానాల్లోనే ప్రయాణించాలని సూచించింది. ఈ ఏడాది ఆగస్టు 31దాకా ఎయిర్ ఇండియా మొత్తం రుణ భారం రూ.61,562 కోట్లుగా ఉన్న సంగతి విదితమే.