‘ఎవరి సినిమా అయినా బాగా ఆడాలనే కోరుకుంటాన్నేను. ఓ ప్రజాప్రతినిధిగా టికెట్ రేట్లు విషయంలోనూ నేను వివక్ష చూపలేదు. నన్నడిగితే.. టికెట్ రేట్లు పెంచమని ప్రభుత్వాలను ప్రత్యేకంగా అడగాల్సిన అవసరం లేదు. పెంచకపోతే బ్లాక్ మార్కెట్ పెరుగుతుంది. అందుకే.. టికెట్ రేట్ల విషయంలో ఎవరు పెంచమని అడిగినా మేం కాదనలేదు. చివరకు కన్నడ సినిమా ‘కాంతారా2’కు కూడా టికెట్లు పెంచుకునే అవకాశం ఇచ్చాం. సినిమా బావుండాలి. అందరూ చూడాలి. అందులో మన సినిమాలు కూడా ఉండాలని కోరుకుంటాన్నేను’ అన్నారు అగ్రహీరో పవన్‌కల్యాణ్.
ఆయన కథానాయకుడిగా రూపొందిన ప్రస్టేజియస్ యాక్షన్ డ్రామా ‘ఉస్తాద్ భగత్‌సింగ్’. శ్రీలీల, రాశీఖన్నా కథానాయికలు. హరీశ్‌శంకర్ దర్శకత్వంలో మైత్రీ మూవీమేకర్స్ పతాకంపై నవీన్ యర్నేని, యలమంచిలి రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల 19న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రీరిలీజ్ ఈవెంట్లో పవన్‌కల్యాణ్ మాట్లాడారు. ఇంకా చెబుతూ ‘ఈ సినిమా బాగా రావడానికి కారణం హరీశ్‌శంకర్.
నా కాలం తాలూకు విలువను అర్థం చేసుకొని నన్ను ముందుకు నడిపించాడు తను. 45రోజుల్లో సినిమా పూర్తి చేశాడు. సినిమాలు చేయాలా వద్దా అనే మీమాంసలో ఉన్న నాకు, ఈ ప్లానింగ్‌తో ముందుకెళ్తే సినిమాలు చేయొచ్చని నమ్మకాన్నీ, ధైర్యాన్నీ ఇచ్చాడు. తను తెలంగాణ బిడ్డ. కరీంనగర్ నుంచి వచ్చిన వ్యక్తి. అద్భుతమైన పాండిత్యం గల గొప్ప దర్శకుడు. ఈ సినిమాకోసం తను పడ్డ తపన సామాన్యమైనది కాదు. ఈ సినిమాని అందరూ మెచ్చేలా తను తీర్చిదిద్దారు.
మా తప్పు లేకుండా సినిమా చేశాం. బెస్ట్ ఎఫెర్ట్ పెట్టాం. తుది తీర్పు ప్రేక్షకులదే’ అని పవన్‌కల్యాణ్ పేర్కొన్నారు. ‘కల్యాణ్‌గారి సినిమా అనగానే పనిచేసిన వారంతా ప్రాణం పెట్టేశారు. కమిట్మెంట్ ఉన్నోడికే కటౌట్ ఉంటది. ఆ కటౌట్ జనం గుండెల్లో ఉంటది. అందుకు నిలువెత్తు నిదర్శనం పవన్‌కల్యాణ్. నా గుండెలో పవన్‌కల్యాణే, గుండె బయట పవన్‌కల్యాణే. నా గుండె ధైర్యం కూడా పవన్‌కల్యాణే. ఒక అభిమానిగా సినిమా చేశా. ఈసారి మార్చి 19న వచ్చేది ఉస్తాద్ ఉగాది. రాసుకోండి’ అని దర్శకుడు హరీష్‌శంకర్ నమ్మకంగా చెప్పారు. ఇంకా చిత్రబృందంతోపాటు పార్దీబన్, టీజీ విశ్వప్రసాద్, బుచ్చిబాబు పాల్గొన్నారు.