Pawan Kalyan | జూన్ 2, 2025 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అన్ని జిల్లాల్లోనూ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. తెలంగాణ ఏర్పడి నేటితో 11 యేళ్లు పూర్తి చేసుకొని 12వ యేట అడుగుపెట్టింది. మన దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడింది. తెలంగాణ తర్వాత మనదేశంలో కొత్తగా మరే రాష్ట్రం ఏర్పడలేదు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి కేసీఆర్ తొలి ముఖ్యమంత్రి అయ్యారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం రోజునే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం మనకు తెలిసిందే.
అయితే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రజలకి పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజలకు తన శుభాకాంక్షలను తెలియజేస్తూ.. “తెలంగాణ నా ఉద్యమానికి పునాది” అని పేర్కొంటూ రాష్ట్ర ప్రజల మనసులను గెలుచుకున్నారు. ఆయన తన ట్వీట్లో జనసేన పార్టీకి జన్మనిచ్చిన నేల, నాకు పునర్జన్మను ఇచ్చిన నేల, నాలో ఉద్యమ స్ఫూర్తిని నింపిన నేల, నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ దాశరథి కృష్ణమాచార్య కీర్తించిన నేల నా తెలంగాణ. మూడున్నర కోట్ల ప్రజల ఆశలు, ఆకాంక్షలకు, దశాబ్దాల పోరాటాలకు ప్రతిరూపంగా, విద్యార్ధులు, యువత బలిదానాలతో ఏర్పడిన రాష్ట్రం తెలంగాణ అని అన్నారు.
రాష్ట్రం ఏర్పడి 11 సంవత్సరాలు పూర్తి చేసుకుని 12వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా అన్ని రంగాలలో సంక్షేమాభివృద్ధి పథంలో దూసుకెళ్లాలని, ప్రజల ఆకాంక్షలు నెరవేరాలని ఆకాంక్షిస్తూ, ప్రజలందరికీ, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అని పవన్ కళ్యాణ్ తన ట్వీట్లో పేర్కొన్నారు. ఇక దశాబ్దాల కాలపు కొట్లాటకు, నాలుగు కోట్ల ప్రజల తండ్లాటకు విముక్తి లభించిన రోజు నేడు.సుదీర్ఘ స్వప్నం.. సాకారమైన సుదినం నేడు.‘తెలంగాణ వచ్చుడో ..కేసీఆర్ సచ్చుడో..కేసీఆర్ శవయాత్రో..తెలంగాణ జైత్రయాత్రో’ అంటూ నినదించిన కేసీఆర్ గారు గమ్యాన్ని ముద్దాడే వరకు విశ్రమించలేదు. సబ్బండ వర్గాలు ఏకమై గర్జించి, ఆత్మగౌరవం కోసం సాగిన పోరాట ఫలితం తెలంగాణ..రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు అని హరీష్ రావు రాసుకొచ్చారు.