హైదరాబాద్, ఆట ప్రతినిధి: రాష్ట్ర యువ వెయిట్‌లిఫ్టర్ కేవీఎల్ పావని కుమారి మరోమారు జాతీయ వేదికపై మెరిసింది. బీజూ పట్నాయక్ ఇండోర్ స్టేడియం వేదికగా జరుగుతున్న జాతీయ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో పావని కుమారి స్వర్ణ పతకం సహా రజతం, కాంస్యం దక్కించుకుంది. సోమవారం జరిగిన మహిళల 45 కిలోల విభాగంలో బరిలోకి దిగిన పావని..స్నాచ్‌లో 66 కిలోలు, క్లీన్ అండ్ జర్క్‌లో 85 కిలోలు ఎత్తి మొత్తంగా 151 కిలోలతో అద్భుత ప్రదర్శన కనబరిచింది. జూనియర్ విభాగంలో పసిడి పతకంతో మెరిసిన ఈ హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ పూర్వ విద్యార్థి సీనియర్ కేటగిరీలో కాంస్యం, ఇంటర్‌స్టేట్ విభాగంలో రజతం సొంతం చేసుకుంది. బరిలోకి దిగిన మూడు కేటగిరీల్లో మూడు పతకాలు ఖాతాలో వేసుకుని తనకు తిరుగులేదని చాటిచెప్పింది. పావని ప్రదర్శన పట్ల కోచ్ మాణిక్యాల్‌రావు హర్షం వ్యక్తం చేశారు.