రామగిరి, ఏప్రిల్ 15 : సింగరేణి అర్జీ డివిజన్లోని సెంటినరీ కాలనీలో ఉన్న అర్జీ-3 డిస్పెన్సరీలో తాగునీటి సమస్య తీవ్రంగా మారింది. గత మూడు నెలలుగా ప్యూరిఫైడ్ వాటర్ యంత్రం పనికిరాకుండా మూలన పడివుండగా దానిని మరమ్మతు చేయడంలో సంబంధిత అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నదని స్థానికులు ఆరోపిస్తున్నారు. డిస్పెన్సరీలో పనిచేస్తున్న వైద్య సిబ్బంది, ఉద్యోగులు, అలాగే చికిత్స కోసం వచ్చే కార్మికులు వారి కుటుంబ సభ్యులు త్రాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ముఖ్యంగా వేసవి కాలం ప్రారంభమైన నేపథ్యంలో నీటి అవసరం పెరిగినా, సమస్య పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ విషయంపై పలుమార్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ స్పందన లేకపోవడం వల్ల పరిస్థితి మరింత దిగజారిందని తెలిపారు. తక్షణమే ప్యూరిఫైడ్ వాటర్ యంత్రాన్ని మరమ్మతు చేసి, తాగునీటి సరఫరా పునరుద్ధరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, డిస్పెన్సరీలో తాగునీటి సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉంది.