సీలియా తుఫాను కారణంగా ఆఫ్రికా ఖండంలోని అతిపెద్ద సహారా ఎడారి అతలాకుతలం అయింది. దానిపై నుంచి వచ్చిన దుమ్ము, ధూళి మధ్యదరా సముద్రం దాటి యూరప్ ఖండంలో ప్రవేశించింది. స్పెయిన్ దేశంలోని దక్షిణ భూభాగాలన్నీ ఈ దుమ్ము ప్రభావానికి లోనయ్యాయి. ఈ ప్రాంతాల్లో ఆకాశం ఎరుపెక్కింది.
ఈ క్రమంలో ప్రజలెవరూ ఎక్కువ సేపు బయట ఉండొద్దని, మాస్కులు ధరించాలని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ఇక్కడ గాలి నాణ్యత చాలా దారుణంగా పడిపోయిందని అలికాంటె యూనివర్సిటీలోని ల్యాబొరోటోరియో డి క్లైమాటోలోగియా (వాతావరణ శాస్త్ర విభాగం) పేర్కొంది.
కొన్ని ప్రాంతాల్లో ప్రజలెవరూ ఎక్సర్సైజులు చేయొద్దని నిపుణులు హెచ్చరించారు. క్యానరీ ఐలాండ్స్, బాలేరిక్ దీవుల్లో కూడా గాలి నాణ్యత దెబ్బతిన్నట్లు చెప్పారు. అంతేకాదు, ఈ ధూళి మేఘాలు యూకే వైపు ప్రయాణిస్తున్నాయని వెల్లడించారు.