Mallikarjun Kharge : ఇంగ్లీష్ పేపర్లలో వ్యాసాలు రాయడం కాకుండా.. కాంగ్రెస్ పార్టీ చేపట్టే నిరసనల్లో కూడా పాల్గొనాలని ఆ పార్టీ సీనియర్ నేత శశి థరూర్‌కు కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సూచించారు. మంగళవారం ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) మీటింగ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ సమావేశానికి కాంగ్రెస్ అగ్రనేతలు ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, శశి థరూర్ వంటి నేతలు హాజరయ్యారు.
సర్ అంశం, సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా సహా పలు తాజా రాజకీయ పరిణామాలు, కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ వ్యూహాలపై సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకత్వానికి శశిథరూర్ కీలక సూచన చేశారు. గాంధీ జయంతి రోజు, అక్టోబర్ 2న న్యూఢిల్లీలో పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన చేపట్టాలని సూచించారు. దీనికి మల్లికార్జున ఖర్గే స్పందించారు. ఎప్పుడూ ఆంగ్ల పత్రికలలో వ్యాసాలు రాయడం మాత్రమే కాకుండా.. కాంగ్రెస్ చేపట్టే నిరసనల్లో కూడా పాల్గొనాలని సూచించారు. ఈ విషయలో ఇద్దరి మధ్యా చిన్న వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది.
అలాగే, ఇటీవల ఖర్గే పాల్గొన్న ఒక మీటింగ్‌లో వేదికను పసుపు నీళ్లతో శుభ్రం చేసినందుకు బీజేపీపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ విషయంలో కాంగ్రెస్‌లోని సీనియర్ నాయకులు సరిగ్గా స్పందించలేదని ఖర్గే అసంతృప్తి వ్యక్తం చేశారు. సీడబ్ల్యూసీ మీటింగ్‌లో ఈ విషయంపై ఖర్గే అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. తనకు చాలా మంది కాంగ్రెస్ నాయకులు మద్దతు ఇవ్వలేదని, సరైన రీతిలో స్పందించలేదని ఆయన అన్నారు. ఇక.. శశి థరూర్ అంశానికి సంబంధించి ఆయన వివిధ ఆంగ్ల పత్రికలకు నిత్యం వ్యాసాలు రాస్తుంటారనే సంగతి తెలిసిందే.
ప్రభుత్వాన్ని విమర్శిస్తూ, కొన్ని సూచనలు చేస్తూ ఆయన వ్యాసాలు రాస్తుంటారు. కొన్నిసార్లు కాంగ్రెస్ పార్టీకి, నాయకులకు కూడా చురకలు అంటిస్తుంటారు. జాతీయ, అంతర్జాతీయ అంశాలపై కూడా తన అభిప్రాయాల్ని చెబుతుంటారు.