న్యూఢిల్లీ, డిసెంబర్ 18: అణు ఇంధన రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ఆహ్వానించేందుకు ఉద్దేశించిన శాంతి బిల్లును పార్లమెంట్ ఆమోదించింది. సస్టెయినబుల్ హార్నెసింగ్ అండ్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా(శాంతి) బిల్లును మూజువాణి ఓటుతో రాజ్యసభ గురువారం ఆమోదించింది. బుధవారమే ఈ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. బిల్లును పార్లమెంటరీ కమిటీకి పంపించాలన్న ప్రతిపాదనతోసహా విపక్ష సభ్యులు ప్రతిపాదించిన పలు సవరణలను రాజ్యసభ తిరస్కరించింది.
బిల్లుపై అణు ఇంధన శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ సభలో స్పందిస్తూ అణు ఇంధన రంగంలో భారత్ స్వయం సమృద్ధి సాధించేందుకు, ఇతర ఇంధన వనరులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు ప్రతిపాదిత చట్టం దోహదపడుతుందని తెలిపారు. అంతకుముందు రాజ్యసభలో అధికార, విపక్ష సభ్యుల మధ్య వాడీవేడి చర్చ జరిగింది. అణు ఇంధనాన్ని ప్రైవేటీకరించడం వల్ల భద్రత, జవాబుదారీతనం లోపించే ప్రమాదం ఉందని విపక్ష సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు.
భారతదేశ అణు ఇంధన వ్యవస్థను ధనాధిపత్యంగా మార్చడమే ఈ బిల్లు ఉద్దేశమని టీఎంసీ ఎంపీ సాగరికా ఘోష్ వ్యాఖ్యానించారు. తగిన రక్షణలు లేకుండా ప్రైవేట్ నియంత్రణకు ఈ రంగం తలుపులు తెరుస్తున్నారని ఆమె విమర్శించారు. డీఎంకే ఎంపీ విల్సన్ సైతం ఇవే అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ తీవ్రమైన భద్రతా అంశాలపై బిల్లులో ప్రస్తావన లేదని అన్నారు. అణు ఇంధన పరికరాలను సరఫరా చేసే సరఫరాదారుని జవాబుదారీతనాన్ని ఈ బిల్లు ద్వారా బలహీనపరిచారని ఆయన చెప్పారు. వాతావరణ మార్పులను దృష్టిలో పెట్టుకుని అణు ఇంధన కేంద్రాలు సురక్షితంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆయన హెచ్చరించారు.
విదేశాల రెగ్యులేటరీ వ్యవస్థలను అనుసరించకుండా నేరుగా విదేశీ ప్రైవేట్ అణు ఇంధన నమూనాను ఈ బిల్లు ద్వారా దిగుమతి చేసుకుంటున్నట్లు ఆప్ ఎంపీ సందీప్ కుమార్ పాఠక్ వ్యాఖ్యానించారు. ప్రతిపాదిత చట్టంతో రాష్ర్టాలకు, స్థానిక వర్గాలకు ఒనగూరే ప్రయోజనాలు ఏమిటో స్పష్టతలేదని వైఎస్సార్సీపీ ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. స్థానికులకు ఉపాధి భరోసా, రాష్ర్టాలకు విద్యుత్ కేటాయింపులో ప్రాధాన్యత, సామాజిక అభివృద్ధి వంటి విషయాలేవీ బిల్లులో లేవని ఆయన చెప్పారు.
ప్రతిపక్షాల నిరసనల నడుమ ఎంజీనరేగాను భర్తీ చేసే వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవిక మిషన్(గ్రామీణ్)(వీబీ-జీ రామ్ జీ) బిల్లుకు లోక్‌సభ గురువారం ఆమోదం తెలిపింది. కొత్త బిల్లులో మహాత్మా గాంధీ పేరును తొలగించడంతోపాటు నరేగా నిబంధనలను కేంద్రం నీరుగార్చిందని ప్రతిపక్ష సభ్యులు నిరసన తెలుపుతూ వెల్‌లోకి దూసుకువెళ్లి బిల్లును ప్రతులను చింపి స్పీకర్‌పై విసిరారు. కాగా, ప్రభుత్వ నిర్ణయాన్ని గట్టిగా సమర్థించిన కేంద్ర వ్యవసాయ మంత్రి శివ్‌రాజ్ సింగ్ చౌహాన్ 2009 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నరేగాకు మహాత్మ గాంధీ పేరును అప్పటి యూపీఏ ప్రభుత్వం జతచేసిందని ఆరోపించారు.
తొలుత ఈ చట్టం పేరు నరేగా మాత్రమేనని, 2009 సార్వత్రిక ఎన్నికల సమయంలో మహాత్మా గాంధీ పేరున అప్పటి ప్రభుత్వం చేర్చిందని ఆయన అన్నారు. జీ రామ్ జీ బిల్లుపై రాజ్యసభలో గురువారం ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడ్డాయి. ఈ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని, తిరోగమన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశాయి. సీపీఎం ఎంపీ బికాశ్ రంజన్ భట్టాచార్య మాట్లాడుతూ, ఇది ఉపాధి హామీ పథకాన్ని డిమాండ్‌ను బట్టి అమలు చేయడానికి బదులుగా అధికారుల నియంత్రణలోకి మార్చుతుందన్నారు.