బీజింగ్: చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ శాస్త్రవేత్తలు బ్రెయిన్-కంప్యూటర్ ఇంటర్ఫేస్ (బీసీఐ) టెక్నాలజీలో గొప్ప విజయం సాధించారు. పక్షవాతం గల రోగి చేత స్మార్ట్ వీల్‌చైర్స్, రోబోటిక్ డాగ్స్‌ను కంట్రోల్ చేయించడంతోపాటు పెయిడ్ వర్క్ చేయించగలిగారు. అత్యంత తీవ్ర స్థాయిలో వెన్నెముక గాయంతో బాధపడుతున్న వ్యక్తి నిలకడగా రకరకాల అసిస్టివ్ రోబోలను నియంత్రించగలగడం ఇదే మొదటిసారి. ఆయన మెదడులో అమర్చిన వైర్లెస్ బీసీఐ సిస్టమ్‌తో ఇది సాధ్యమైంది. ఈ వివరాలను సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ బ్రెయిన్ సైన్స్ అండ్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వెల్లడించింది. ఈ రోగి 2022లో ఎత్తు నుంచి పడిపోవడంతో వెన్నెముక తీవ్రంగా దెబ్బతిన్నది.
ఆయన తల, మెడ మాత్రమే కదపగలుగుతారు. జూన్ 20న షాంఘైలో ఆయన మెదడుకు శస్త్రచికిత్స చేసి డబ్ల్యూఆర్ఎస్01ని అమర్చారు. తర్వాత ఆయన తన మెదడు సంకేతాల ద్వారా కంప్యూటర్ కర్సర్‌ను నియంత్రించగలిగారు. ఈ విధంగా చేసిన తొలి వ్యక్తి ఆయనే. మూడేండ్ల తర్వాత తాను పని చేయగలుగుతున్నానని ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఆయన టేక్ఎవేను ఆర్డర్ ఇచ్చి, దానిని రోబో డాగ్ చేత ఇంటికి తెప్పించగలిగారు. ఇంటి పరిసరాల్లో సంచరించగలిగారు.
ఆయన మెడ కింద శరీర భాగాలు కదలని స్థితిలో ఉన్నప్పటికీ ఈ పనులన్నిటినీ చేయగలిగారు. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన టెలిపతి ప్రాజెక్ట్ వెనుక గల దార్శనికతను ఈ విజయం ఆచరణలోకి తెచ్చింది. మనసుతో పరికరాలను నియంత్రించే అవకాశం ప్రజలకు ఉండాలనేది టెలిపతి లక్ష్యం. రోగులు వీడియో గేమ్స్ ఆడటం, నీరు తాగడం వంటి పనులు చేయడంపై పరీక్షలు జరుగుతున్నాయి. అయితే, చైనా ఇప్పటికే అభివృద్ధి సాధించి, వాస్తవ ప్రపంచంలో అమల్లోకి తెచ్చింది.