హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ): కాలేజీ బ్రాండ్ పెంచుకొని మరిన్ని అడ్మిషన్లు రాబట్టుకొనేందుకే స్వాతి కాలేజీ యాజమాన్యం పేపర్ లీక్ చేసినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ కేసులో స్టేట్ బోర్డు ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ అబ్జర్వర్‌తో పాటు మరో ముగ్గుర్ని రాచకొండ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. వారిని విచారించగా మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. పాలిటెక్నిక్ పరీక్షలను ఈ నెల 8 నుంచి 12 వరకు నిర్వహించాల్సి ఉన్నది. అయితే, విద్యార్థుల అడ్మిషన్లను పెంచుకోవాలన్న ఉద్దేశంతో స్వాతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ యాజమాన్యం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యేలా చూడాలని సిబ్బందికి సూచించారు. దీంతో కాలేజీ సిబ్బంది వెంకటేశ్వర్లు, కృష్ణమూర్తి, కృష్ణమోహన్.. పేపర్లను లీక్ చేయాలని పథకం వేశారు. అబ్జర్వర్ వెంకట్రాంరెడ్డితో మిలాఖత్ అయ్యారు. ఆయన పరీక్ష సెంటర్‌కు ఉదయం 9 గంటలకే రావాల్సి ఉన్నా, 9.40కి వచ్చేవారు. ఆ సమయంలో కాలేజీ యాజమాన్యం ప్రశ్నపత్రాన్ని లీక్ చేసి విద్యార్థులకు వాట్సాప్ చేశారు. అలా ఈ నెల 8, 9 తేదీల్లో జరిగిన ప్రశ్నపత్రాలను లీక్ చేశారు.
బయటపడిందిలా..
మహబూబ్‌నగర్‌లోని ఓ కాలేజీలో విద్యార్థులు పరీక్ష సమయం దాటినా హాల్లోకి రాకుండా సెల్ఫోన్లు చూస్తూ కూర్చున్నారు. ఆ తర్వాత వచ్చి వేగంగా పరీక్ష రాశారు. అక్కడ పనిచేస్తున్న లెక్చరర్లకు అనుమానం వచ్చి విద్యార్థుల సెల్ఫోన్లు తనిఖీ చేయగా.. ప్రశ్నపత్రాలు కనిపించాయి. ఆ ప్రశ్నపత్రం కోడ్ స్వాతి కాలేజీకి చెందినదిగా గుర్తించి స్టేట్ బోర్డు ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ అధికారులకు సమాచారమిచ్చారు. బోర్డు అధికారులు ప్రాథమిక ఆధారాలతో రాచకొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ప్రశ్నపత్రాన్ని స్వాతి ఇన్స్టిట్యూట్లో చదువుతున్న ఓ విద్యార్థి మహబూబ్‌నగర్‌లో పాలిటెక్నిక్ చదువుతున్న స్నేహితుడికి వాట్సాప్ చేయటంతో విద్యార్థులందరికీ షేర్ అయ్యిందని పోలీసులు తేల్చారు.