KCR | చౌటకూర్, ఫిబ్రవరి 18: బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును బీఆర్ఎస్ సీనియర్ నేత, జోగిపేట ఏఎంసీ మాజీ చైర్మన్ పల్లె సంజీవయ్య మంగళవారం కలిశారు. రాష్ట్ర ట్రేడ్ కార్పోరేషన్ మాజీ చైర్మన్ మఠం భిక్షపతి, జడ్పీ మాజీ చైర్మన్ మాసన్నగారి బాలయ్య, ఇతర నాయకులతో కలసి సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్‌ను కలిసి పుష్పగుచ్చం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
అచరణ సాద్యం కాని హామీలిచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ఈ సందర్భంగా కేసీఆర్ పేర్కొన్నారని సంజీవయ్య తెలిపారు. 420 హామీలిచ్చి అధికారం చేపట్టి నేడు చేతులెత్తేసిందన్నారు. ఏడాదికాలం వ్యవధిలోనే కాంగ్రెస్ ప్రభుత్వ పాలనను ప్రజలు అసహించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఎకరాకు రూ.15 వేలు ఇస్తామని చెప్పి, రూ.12 వేలు చెల్లించడం సిగ్గుచేటని విమర్శించారు. వచ్చేది ఇక బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో గట్టిగా పోరాడాలని పిలుపునిచ్చారు.