న్యూఢిల్లీ: ఇరాన్‌పై ప్రస్తుతం అయిదు రోజుల పాటు దాడుల్ని నిలిపివేస్తున్నట్లు సోమవారం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే గత రెండు రోజుల నుంచి ఇరాన్‌తో చర్చలు జరుగుతున్నాయని, అవి నిర్మాణాతంగా సాగుతున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఓ కీలక అంశం వెలుబడింది. అమెరికా, ఇరాన్ మధ్య శాంతి నెలకొల్పేందుకు.. పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్(Asim Munir) మధ్యవర్తిత్వం వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఇరాన్, అమెరికా మధ్య ఉన్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు పాకిస్థాన్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు బ్రిటన్‌కు చెందిన ఫైనాన్షియల్ టైమ్స్ ఓ కథనాన్ని రాసింది.
ఇటీవల ట్రంప్‌తో పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ చర్చలు జరిపారని, అమెరికా-ఇజ్రాయెల్ దళాలు ఇరాన్లో జరుగుతున్న దాడుల్ని నివారించే ఉద్దేశంతో అసిమ్ మునీర్ ఆ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ట్రంప్ సర్కారులోని ఉన్నతాధికారులు, ఇరాన్ ఉన్నతాధికారులతో మునీర్ చర్చలు నిర్వహించారని, శాంతి నెలకొల్పే ఉద్దేశంతో ఆ చర్చలు జరిగినట్లు ఫైనాన్షియల్ టైమ్స్ పేర్కొన్నది. ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజిష్కియాన్‌తో పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కూడా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.
ఇరాన్ సంక్షోభానికి దౌత్యపరమైన పరిష్కారాన్ని కనుగొనేందుకు పాకిస్థాన్ ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆ కథనంలో వెల్లడించారు. పాకిస్థాన్‌తో పాటు టర్కీ, ఈజిప్ట్ కూడా దౌత్యపరమైన మార్గాన్ని అనుసరిస్తున్నాయని ఆ రిపోర్టులో పేర్కొన్నారు. అమెరికా తరపున పశ్చిమాసియా దౌత్యవేత్త స్టీవ్ విట్కాఫ్, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరగాచీ కూడా ఆ చర్చల్లో పాల్గొన్నారు. టెహ్రాన్‌తో పాటు అమెరికా కీలక నేతల మధ్య పరోక్షంగా చర్చలు నిర్వహిస్తున్నట్లు, దీని కోసం పాకిస్థాన్ అధికారులు చర్యలు చేపడుతున్నారని ఫైనాన్షియల్ టైమ్స్ వెల్లడించింది. ఈ చర్చల్లో విట్కాఫ్తో పాటు జేర్డ్ కుష్నర్ కూడా పాల్గొన్నారు.
మరో వైపు రెండు రోజుల నుంచి చర్చలు జరుగుతున్నట్లు ట్రంప్ చేసిన వ్యాఖ్యలను ఇరాన్ తోసిపుచ్చిన విషయం తెలిసిందే. కానీ మిత్ర దేశాల నుంచి చర్చల సమాచారం అందుతున్నట్లు ఇరాన్ ఒప్పుకున్నది. తమతో సంప్రదింపులు జరుపుతున్న వారితో తమ విధానాన్ని వెల్లడిస్తున్నామని ఇరాన్ చెప్పింది. పాకిస్థాన్‌లో అమెరికా మిలిటరీ స్థావరాలు లేవని, దాని వల్లే ఇరాన్‌తో ఆ దేశం నేరుగా మధ్యవర్తిత్వ చర్చలు నిర్వహిస్తున్నదని కూడా మీడియా రిపోర్టులో వెల్లడించారు.
అమెరికా దౌత్యవేత్తలు స్టీవ్ విట్కాఫ్, జేర్డ్ కుష్నర్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్.. ఈ వారంలో పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌కు పర్యటించే అవకాశాలు ఉన్నట్లు ఓ అంతర్జాతీయ మీడియా పేర్కొన్నది. ఇరాన్ అధికారులతో ఇస్లామాబాద్‌లో చర్చలు జరిగే అవకాశం ఉందని ఆ రిపోర్టులో తెలిపారు. అయితే శ్వేతసౌధం మాత్రం ఆ వార్తలపై ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. చాలా సున్నితమైన దౌత్య చర్చలు జరిగే అవకాశం ఉందని, మీడియా ద్వారానే అమెరికా చర్చలు జరిపే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. చర్చల గురించి అధికారిక ప్రకటన చేసే వరకు దేన్ని విశ్వసించరాదు అని వైట్‌హౌజ్ ప్రెస్ సెక్రటరీ కరోలినా లెవియట్ పేర్కొన్నారు.