ముంబై : ముఖేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఆ పెళ్లి వేడుకకు హాలీవుడ్, బాలీవుడ్ తారలతో పాటు అనేక మంది సెలబ్రిటీలు హాజరయ్యారు. రకరకాల దుస్తుల్లో ఆ సెలబ్రిటీలు మెరిసిపోయారు. అయితే పాకిస్థాన్‌కు చెందిన డిజైనర్లు(Pakistani Designers) రూపొందించిన దుస్తుల్లోనూ ఇండియన్ స్టార్స్ వెలిగిపోయారు. ఇక్బాల్ హుస్సేన్, ఫరాజ్ మన్నన్, మోషిన్ నవీద్ రాంజా రూపొందించిన దుస్తులను ఇండియన్ సెలబ్రిటీలు ధరించారు.
సైఫ్ అలీ ఖాన్ కుమార్తె సారా అలీ ఖాన్, నటి ఆలియా భట్, కెనిడియన్ సింగర్ ఏపీ ధిల్లాన్, భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యాలు.. పాక్ డిజైనర్లు తయారు చేసిన దుస్తుల్లో ధగధగలాడారు. ఆలియా భట్ బ్లాక్ డ్రెస్సులో జిగేల్మంది. సంగీత్ సర్మనీ కోసం ఆ డిజైన్ డ్రెస్సు వేసుకుందామె. దీన్ని ఫరజ్ మన్నన్ డిజైన్ చేశారు. సోషల్ మీడియాలో ఆలియా భట్ డ్రెస్సుపై ప్రశసంలు వచ్చాయి.
శుభ్ వివాహ్ సెర్మనీకి నటి సారా అలీఖాన్ హాజరైంది. ఇక్బాల్ హుస్సేన్ డిజైన్ చేసిన ఓలీవ్ గ్రీన్ డ్రెస్సులో ఆమె మెరిసింది. శుభ్ అశీర్వాద్ వేడుక కోసం ఆమె లాంగ్ ఫ్రాక్, గోల్డెన్ లెహంగాలో కనిపించింది.
లైట్ పింక్ డ్రెస్సులో హార్దిక్ పాండ్యా మెరిశాడు. ఆ డ్రెస్సును ఫరాజ్ మన్నన్ డిజైన్ చేశారు. దిల్లాన్ కూడా మన్నన్ డిజైన్ చేసిన డ్రెస్సు ధరించాడు.