షార్జా: సీనియర్ ఆటగాడు షోయబ్ మాలిక్ (18 బంతుల్లో 54 నాటౌట్; ఒక ఫోర్, 6 సిక్సర్లు) సుడిగాలి ఇన్నింగ్స్‌తో చెలరేగడంతో టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ అజేయంగా సెమీస్‌లో అడుగుపెట్టింది. ఆదివారం జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో పాకిస్థాన్ 72 పరుగుల తేడాతో స్కాట్లాండ్ను చిత్తు చేసింది. ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన పాక్ 10 పాయింట్లతో గ్రూప్-2లో అగ్రస్థానంలో నిలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 189 పరుగులు చేసింది. కెప్టెన్ బాబర్ ఆజమ్ (66; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధశతకం సాధించగా.. ఆఖర్లో మాలిక్ ప్రత్యర్థిపై సునామీలా విరుచుకుపడ్డాడు. అనంతరం లక్ష్యఛేదనలో స్కాట్లాండ్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 117 పరుగులు చేసింది. బెర్రింగ్టన్ (54 నాటౌట్) టాప్ స్కోరర్. పాక్ బౌలర్లలో షాదాబ్ ఖాన్ రెండు వికెట్లు పడగొట్టాడు. మెరుపు ఇన్నింగ్స్ ఆడిన మాలిక్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.