న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్‌లో నియంత్రణ రేఖ, అంతర్జాతీయ సరిహద్దు (ఐబీ) వెంబడి పాకిస్థాన్ ఏకపక్షంగా కాల్పులకు తెగబడుతున్నది. వరుసగా ఆరో రోజు బుధవారం రాత్రి నాలుగు జిల్లాల్లోని వివిధ సెక్టార్లలో పాక్ సైన్యం కాల్పులు జరిపిందని, వీటిని భారత సైన్యం దీటుగా తిప్పికొట్టిందని రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. జమ్ములోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి, రాజౌరీ జిల్లాలోని సుందరబానీ, నౌషార సెక్టార్లలో, కశ్మీర్‌లోని బారాముల్లా, కుప్వారాలో భారత్ సైనిక పోస్టులే లక్ష్యంగా పాక్ ఆర్మీ కాల్పులు జరిపిందని తెలిపింది. 2003 నాటి కాల్పుల విరమణ ఒప్పందాన్ని పునరుద్ధరిస్తూ భారత్-పాక్ మధ్య ఫిబ్రవరి 2021లో అంగీకారం కుదిరింది.
అయితే దీనిని పాక్ ఏకపక్షంగా ఉల్లంఘిస్తూ, వరుసగా ఆరో రోజు రాత్రి భారత్ సైన్యంపై కాల్పులు జరిపినట్టు అధికారులు వెల్లడించారు. ఇరు దేశాలను విడదీస్తూ గుజరాత్ నుంచి జమ్ములోని అఖ్నూర్ వరకు 3,323 కిలోమీటర్ల వెంబడి భారత్ సరిహద్దును కలిగి ఉంది. ఇందులో అంతర్జాతీయ సరిహద్దు 2,400 కిలోమీటర్లుగా, 740 కిలోమీటర్లు ఎల్వోసీ (నియంత్రణ రేఖ)గా ఉంది. కాల్పుల విరమణ ఒప్పందానికి పాక్ తూట్లు పొడవడంపై భారత్ హెచ్చరికలు జారీచేసింది. ఇరు దేశాలకు చెందిన మిలిటరీ ఆపరేషన్ డైరెక్టర్ జనరళ్లు హాట్‌లైన్ ద్వారా మాట్లాడుకున్నారని, పాక్ కాల్పులకు తెగబడుతుండటంపై భారత్ వార్నింగ్ ఇచ్చినట్టు రక్షణ శాఖ అధికారులు తెలిపారు.
పీవోకేకు విమానాలు రద్దు
పాక్ ఆక్రమిత కశ్మీరు మీదుగా ప్రయాణించే విమానాలను పాకిస్థాన్ బుధవారం రద్దు చేసింది. గిల్గిట్, స్కర్దు, ఇతర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగించే విమానాలను రద్దు చేసినట్లు పాక్ మీడియా వెల్లడించింది. కరాచీ, లాహోర్ల నుంచి స్కర్దుకు వెళ్లే రెండు విమానాలను, ఇస్లామాబాద్ నుంచి స్కర్దు, గిల్గిట్ వెళ్లే విమానాలను రద్దు చేసినట్లు తెలిపింది.