హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ): శుత్రువుకు ఎలా జవాబు చెప్పాలో తమ సైన్యానికి తెలుసు అని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ పేర్కొన్నారు. భారత్ చేపట్టిన యుద్ధ చర్యకు దీటుగా జవాబు చెప్పే హక్కు పాకిస్థాన్‌కు ఉన్నదని, నిజానికి తమ ప్రతిఘటన బలంగా ఉన్నదని చెప్పుకున్నారు. శత్రువును తన దుర్మార్గపు ఎత్తుగడలలో విజయం సాధించడానికి ఎన్నడూ అనుమతించబోమని పేర్కొన్నారు. ప్రధాని షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలోని నేషనల్ సెక్యూరిటీ కమిటీ (ఎన్ఎస్సీ) బుధవారం అత్యవసరంగా సమావేశం అయ్యింది.
పాక్ ఉప ప్రధాని ఇషాక్ దార్, రక్షణ మంత్రి ఖాజావా ఆసిఫ్, జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ చీఫ్ జనరల్ షాహిర్ శంషద్ మీర్జా, ఐఎస్ఐ డైరెక్టర్ జనరల్ అసిమ్ మాలిక్, ఇతర సైనిక ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత్‌పై ప్రతీకార దాడికి సైన్యానికి పూర్తి స్వేచ్ఛను ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఎప్పుడు, ఎక్కడ, ఎలా దాడులు చేయాలో సైన్యం నిర్ణయం తీసుకోవాలని సూచించారు. భారత్ దాడుల్లో 26 మంది మరణించారని, 46 మంది గాయపడ్డారని ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ఐఎస్పీఆర్) డైరెక్టర్ జనరల్ ప్రకటించారు.