Pailam Pilaga Movie OTT | ‘పిల్ల పిలగాడు’ అనే వెబ్ సిరీస్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న సాయితేజ హీరోగా నటించిన తాజా చిత్రం ‘పైలం పిలగా’. ఈ సినిమాలో కథానాయికగా పరేషాన్ ఫేం పావని కరణం నటించగా.. ఆనంద్ గుర్రం దర్శకత్వం వహించాడు. తెలంగాణ విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో లవ్& కామెడీ జానర్లో వచ్చిన ఈ చిత్రం సెప్టెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ లాక్ చేసుకుంది. ప్రముఖ ఓటీటీ ఈటీవీ విన్లో దసరా కానుకగా ఈ సినిమా అక్టోబర్ 10 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు చిత్రబృందం వెల్లడించింది.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. తెలంగాణలోని కోతులగుట్ట గ్రామానికి చెందిన శివ(సాయి తేజ) డిగ్రీ చదివి ఉద్యోగం, వ్యవసాయం చేయడం ఇష్టంలేక ఖాళీగా ఉంటాడు. ఊర్లో ఏ పని చేసినా గుర్తింపు ఉండదని, దుబాయ్‌కి వెళ్లి లక్షలు సంపాదించాలనుకుంటాడు. అయితే అదే ఊరులో ఉన్న దేవి (పావని కరణం) వ్యవసాయం చేసుకుంటూ ఉన్న ఊళ్ళోనే హాయిగా ఉండాలనుకుంటుంది. అయితే శివ అనుకోకుండా దేవితో ప్రేమలో పడతాడు. ఈ క్రమంలోనే శివ దుబాయ్ వెళ్లడానికి రెండు లక్షలు అవసరం పడతాయి. శివ నానమ్మ (డబ్బింగ్ జానకి) తన తాతల కాలం నాటి బీడు భూమి అమ్ముకొని దుబాయ్ పొమ్మని సలహా ఇస్తుంది. కానీ ఆ ల్యాండ్ లిటిగేషన్లో ఉంటుంది. అయితే శివ అమ్మాలి అనుకున్న ఆ స్థలం రహస్యం ఏంటి, అది అమ్మి శివ దుబాయ్ వెళ్లాడా.. దుబాయ్ నుంచి తిరిగి వచ్చి ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడా అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.