
సిటీబ్యూరో, నవంబర్ 2(నమస్తే తెలంగాణ): మహా నగరవాసులకు ఉస్మానియా యూనివర్సిటీ ఆక్సిజన్ అందించడంపై దృష్టి పెట్టింది. రోజు రోజుకు పెరిగిపోతున్న వాహన కాలుష్యం నుంచి యూనివర్సిటీ విద్యార్థులు, వాకర్స్ కోసం ఓయూ అధికార యంత్రాంగం ఆక్సిజన్ పార్కులను ఏర్పాటు చేస్తున్నది. అందుకు సంబంధించి ఓయూ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ రవీందర్ ఆధ్వర్యంలో ఈ పార్కులు రూపుదిద్దుకుంటున్నాయి. గతంలోనే సీఎం కేసీఆర్ ఆదేశాలతో హెచ్ఎండీఏ ఓయూలోని 400 ఎకరాలలో హరితహారం నిర్వహించి, పెద్ద మొత్తంలో మొక్కలు పెంచారు. ఇప్పుడా మొక్కలే పెరిగి, పద్దై నగరవాసులకు ఆక్సిజన్ అందిస్తున్నాయి. అందులో భాగంగా ఆక్సిజన్ పార్కుగా ఏర్పాటు చేసి, కూర్చోవడానికి కుర్చీలతో పాటు ల్యాండ్‌స్కేప్‌ను కూడా అభివృద్ధి చేసే దిశగా ముమ్మర ప్రయత్నాలు కొనసాగుతున్నాయని వీసీ తెలిపారు.
బయో టాయిలెట్లు ఏర్పాటు..
విద్యార్థులు, వాకర్స్‌ను దృష్టిలో పెట్టుకుని బయో టాయిలెట్స్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. వీటిని అందరూ ఉపయోగించుకునే విధంగా అన్ని చర్యలు చేస్తున్నామన్నారు. విశ్వ విద్యాలయంలో ఎవరు పడితే వారు రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని, అసాంఘిక చర్యలు చోటు చేసుకుండా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. అందులో భాగంగా వాకర్స్‌కు కూడా రూ.200 ఫీజును నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే ఓయూలో జనవరి 1, 2022 నుంచి ఆక్సిజన్ పార్కులతో పాటు బయో టాయిలెట్లు అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా అధికారులు అభివృద్ధి పనులు చేపడుతున్నారు. ఈ మేరకు విద్యార్థులు నాణ్యమైన చదువుతో పాటు మంచి ఆరోగ్యాన్ని అందించడంలో భాగంగానే చర్యలు తీసుకుంటున్నామని వీసీ పేర్కొన్నారు.