రామగిరి/ఫర్టిలైజర్‌సిటీ, జూన్ 9: బీఆర్ఎస్ నేత అరెస్ట్ వ్యవహారంలో పెద్దపల్లి జిల్లా రామగిరి పోలీసులు అత్యుత్సాహం జిల్లాలో తీవ్ర దుమారం రేపింది. మంథని సబ్ డివిజన్లోని అడవి శ్రీరాంపూర్‌కు చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్య కేసులో బీఆర్ఎస్ నేత, కమాన్‌పూర్ ఏఎంసీ మాజీ చైర్మన్ పూదరి సత్యనారాయణను బలవంతంగా అదుపులోకి తీసుకొని, అడ్డు వచ్చిన అతని తల్లి కాలుపై నుంచి పోలీస్ వాహనం తీసుకెళ్లిన ఘటన కలకలం రేపింది. కుటుంబ సభ్యులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. మంగళవారం తెల్లవారు జామున రామగిరి ఎస్సై శ్రీనివాస్ తన సిబ్బందితో నాగెపల్లిలో పూదరి సత్యనారాయణ ఇంటికి వెళ్లారు. బలవంతంగా అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. అడ్డుకున్న కుటుంబ సభ్యులను నెట్టివేస్తూ సత్యనారాయణను పోలీస్ వాహనంలో ఎక్కించారు. ఈ క్రమంలో అతని తల్లి రాజేశ్వరి అడ్డుకునే క్రమంలో పోలీసు వాహనం ఆమె కాలు పైనుంచి వెళ్లడంతో తీవ్ర గాయాలయ్యాయి. కేసు నమోదైతే నోటీసులు జారీ చేసి విచారణకు పిలిచే అవకాశం ఉన్నప్పటికీ తెల్లవారు జామున ఇంటికి వచ్చి అదుపులోకి తీసుకోవాల్సిన అవసరం ఏమిటని సత్యనారాయణ కుటుంబ సభ్యులు ప్రశ్నించారు.
ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చి పోలీస్‌స్టేషన్‌కు పిలిస్తే సరిపోయేదని, ఇలా బలవంతంగా అరెస్టు చేయడం వెనుక ఉద్దేశం ఏమిటో స్పష్టం చేయాలని వారు డిమాండ్ చేశారు. కాగా, సత్యనారాయణను రామగిరి నుంచి ముత్తారం స్టేషన్‌కు తరలించిన పోలీసులు, అక్కడ నమోదైన కేసుకు సంబంధించి రిమాండ్ రిపోర్టుతో గోదావరిఖని ఏసీపీ కార్యాలయానికి తీసుకెళ్లారు. అనంతరం గోదావరిఖని ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి నల్లాల వెంకట సచిన్‌రెడ్డి ఎదుట హాజరు పరిచారు. కేసు పరిశీలించిన న్యాయమూర్తి.. నిబంధనల ప్రకారం రిమాండ్ లేదని పూదరి సత్యనారాయణను వదిలిపెట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై స్థానికులు, బీఆర్ఎస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.