నయీంనగర్, మార్చి 17: సౌత్ జోన్ మహిళల ఖో ఖోటోర్నమెంట్లో ఉస్మానియా, తెలంగాణ విశ్వవిద్యాలయాలు శుభారంభం చేశాయి. వరంగల్‌లోని కాకతీయ విశ్వవిద్యాలయం వేదికగా గురువారం ప్రారంభమైన ఈ టోర్నీలో తెలంగాణ సహా ఆరు రాష్ర్టాల నుంచి మొత్తం 67 జట్లు పాల్గొన్నాయి. తొలిరోజు జరిగిన పోటీల్లో..ఉస్మానియా విశ్వవిద్యాలయం 11-6తో క్రిస్ట్ యూనివర్సిటీ (బెంగళూరు)పై ఘన విజయంతో బోణీ చేసింది. మరో మ్యాచ్‌లో తెలంగాణ విశ్వవిద్యాలయం(టీయూ) 17-16తో కోయంబత్తూరు అరుణాచలం ఇన్స్టిట్యూట్పై పోరాడి నెగ్గింది. మిగతా మ్యాచ్‌ల్లో పాలమూరు, మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయాలు నిరాశపర్చాయి. మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం 6-8తో దేవనగరి యూనివర్సిటీ (కర్ణాటక)తో పోరాడి ఓడగా.. పాలమూరు విశ్వవిద్యాలయం 10-11తో నన్నయ్య యూనివర్సిటీ (రాజమండ్రి) చేతిలో పరాజయం పొందింది. అంతకుముందు కేయూ వీసీ రమేశ్, వరంగల్ సీపీ తరుణ్‌జోషి జెండా ఊపి టోర్నీని ప్రారంభించారు. ఆటల్లో గెలుపోటములు సహజమని.. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోవాలని వక్తలు సూచించారు. ఒక ఉన్నత లక్ష్యంతో ముందుకు వెళ్లాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ వెంకట్రామరెడ్డి, క్యాంపస్ కళాశాల ప్రిన్సిపాల్ సురేశ్, రాష్ట్ర ఖో ఖో సంఘం బాధ్యులు రామకృష్ణ, రమేశ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 20వరకు ఈ టోర్నీ జరుగనుందని కేయూ క్రీడా కార్యదర్శి సవితా జ్యోత్స్న తెలిపారు.