US Green Card | టొరంటో, ఫిబ్రవరి 18 : ‘నిజమైన ప్రేమ నేరం కాదు.. కానీ మోసపూరిత వివాహం నేరం’ అని ప్రేమికుల దినోత్సవం సందర్భంగా కెనడా పౌరులను అప్రమత్తం చేస్తూ ఇమ్మిగ్రేషన్, రెఫ్యూజీస్ అండ్ సిటిజన్షిప్ కెనడా(ఐఆర్సీసీ) ‘ఎక్స్’లో చేసిన పోస్ట్ ఇది. కెనడా శాశ్వత నివాసం(పీఆర్) కోసం కొందరు ట్రాప్ చేయవచ్చని, మోసపూరితంగా వివాహం చేసుకోవచ్చని, వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని ఈ సూచన చేసింది. కెనడాలోనే కాదు అమెరికా గ్రీన్ కార్డు పొందేందుకు సైతం ఇలా దొంగ వివాహాలు చేసుకుంటున్న ఉదంతాలు తెరపైకి వస్తున్నాయి. ఏదైనా దేశం వారు కెనడా లేదా అమెరికాలో శాశ్వతంగా స్థిరపడేందుకు ఆ దేశాల పౌరులను వివాహం చేసుకోవడం దగ్గరి దారి. ఇలా చేయడం ద్వారా త్వరగా పీఆర్ లేదా గ్రీన్ కార్డు పొందవచ్చు. ఒక్కొక్కరి నుంచి రూ.17-30 లక్షల వరకు తీసుకుంటూ దొంగ పెండ్లిళ్లు చేయించి పీఆర్ ఇప్పిస్తున్న ఏజెన్సీల గుట్టు కూడా అప్పుడప్పుడు బయటపడుతూనే ఉంది.
గ్రీన్ కార్డు కోసం అమెరికా పౌరులను వివాహం చేసుకున్నట్టు తేలితే కఠిన శిక్షలే ఉన్నాయి. 2023లో విక్రాంత్ చౌహాన్(35) అనే వ్యక్తికి ఈ పని చేసినందుకు కోర్టు ఐదేండ్ల జైలుశిక్ష, రూ.2.2 కోట్ల భారీ జరిమానా విధించింది. కెనడాలోనూ శిక్షలు కఠినంగానే ఉంటాయి. జరిమానా, జైలుశిక్షతో పాటు దేశ బహిష్కరణ,్ల కెనడాలోకి నిషేధించడం వంటి శిక్షలు ఉన్నాయి. డాక్యుమెంట్ల పరిశీలన, ఇండ్లకు వెళ్లి తనిఖీలు చేయడం, భార్యాభర్తలను విచారించడం ద్వారా ఇలాంటి మోసాలను ఐఆర్సీసీ గుర్తిస్తున్నది.