IndiGo | దేశీయ విమానయాన సంస్థ ఇండిగో (IndiGo) సేవల్లో అంతరాయం కొనసాగుతోన్న విషయం తెలిసిందే. గత నాలుగు రోజులుగా వందలాది విమానాలు రద్దయ్యాయి. వరుసగా ఐదోరోజైన శనివారం కూడా దేశవ్యాప్తంగా 500కిపైగా విమానాలు క్యాన్సిల్ అయ్యాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇదే అదునుగా ఇతర విమానయాన సంస్థలు సొమ్ముచేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. విమాన టికెట్ ధరలను (high airfares) భారీగా పెంచాయి.
మిగతా రోజులతో పోలిస్తే టికెట్ ధరలు 3 నుంచి 10 రెట్లు ఎక్కువగా పెంచి విక్రయిస్తున్నాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ, బెంగళూరు టికెట్ ధర రూ.1,02,000 ఉండగా, చెన్నై-ఢిల్లీ టికెట్ రూ.90,000, ఢిల్లీ-ముంబయి టికెట్ రూ.54,222 పలికి ప్రయాణికులకు చుక్కలను చూపాయి. పలు ఎయిర్ లైన్ల టికెట్ ధరలు రూ.20 వేల నుంచి రూ.40 వేల వరకు ఉన్నాయి. ఈ పరిస్థితిపై కేంద్ర విమానయాన శాఖ (Civil Aviation Ministry) తీవ్రంగా స్పందించింది.
విమాన టికెట్ ధరల అడ్డగోలు పెంపుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రయాణికులను అధిక ఛార్జీల భారం నుంచి రక్షించేందుకు చర్యలు చేపట్టింది. ఇండిగో సర్వీసులు రద్దయిన రూట్లలో విమాన టికెట్ ధరలను క్రమబద్ధీకరించింది. కొత్తగా నిర్ణయించిన ఛార్జీలను తప్పనిసరిగా పాటించాలని అన్ని విమానయాన సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. పరిస్థితులు పూర్తిగా సాధారణ స్థితికి వచ్చేవరకు ఈ ఆదేశాలు పాటించాలని స్పష్టం చేసింది. వందల సంఖ్యలో విమాన సర్వీసులు రద్దయిన నేపథ్యంలో సీనియర్ సిటిజన్లు, విద్యార్థులు, వైద్యసహాయం అందాల్సిన ప్రయాణికులు సీట్లు దొరక్క ఇబ్బంది పడుతున్నారని తెలిపింది. ప్రయాణికులపై అదనపు ఆర్థిక భారం పడకుండా చూడాలని సూచించింది. ఈ మేరకు కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ శనివారం ప్రకటన విడుదల చేసింది.
Also Read..
IndiGo | సుప్రీంకోర్టుకు చేరిన ఇండిగో సంక్షోభం.. విమానాల రద్దుపై పిటిషన్ దాఖలు
IndiGo | వరుసగా ఐదో రోజూ అదేసీన్.. నేడు 500 విమానాలు రద్దు.. ఎయిర్‌పోర్టుల్లో ప్రయాణికుల రద్దీ
IndiGo | ఢిల్లీ-బెంగళూరు రూ.లక్ష.. ఆకాశాన్నంటిన విమాన టికెట్ ధరలు