ఉప్పల్, జనవరి 6 : జ్ఞాన ఆర్థిక వ్యవస్థలో బిగ్ ఎర్త్ డేటా అత్యంత కీలకమైనదని, శాస్త్ర, సాంకేతిక రంగాలలో భారత్‌దే భవిష్యత్తు అని కేంద్ర శాస్త్ర సాంకేతిక, భూశాస్త్ర సహాయ మంత్రి జితేంద్రసింగ్ అన్నారు. హబ్సిగూడలోని సీఎస్ఐఆర్-నేషనల్ జియో ఫిజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఎన్జీఆర్ఐ)లో గురువారం ఓపెన్ రాక్ మ్యూజియంను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, శాస్త్రవేత్తలు వినూత్నంగా ఆలోచించి ప్రజా సమస్యలు పరిష్కరించడానికి కృషిచేయాలన్నారు. శాస్త్ర, సాంకేతిక ఆధారిత ఆలోచనలు, ప్రాజెక్టుల అమలుకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కలిసినప్పుడు ఎన్జీఆర్ఐ సేవలు సద్వినియోగం చేసుకోవాలని, తద్వారా సైన్స్, పరిశోధనలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతామని తెలిపారు. శుష్క ప్రాంతాల్లో భూగర్భ జల వనరుల మ్యాపింగ్ చేయడానికి కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్) అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తుందన్నారు.
తద్వారా భూగర్భ జలాలను తాగునీటి అవసరాలకు ఉపయోగించుకోవడంలో సహాయ పడుతుందని తెలిపారు. ఎన్జీఆర్ఐ డైరెక్టర్ విఎం.తివారి ఎన్జీఆర్ఐ చేపట్టిన పలు కార్యక్రమాలు, పరిశోధనలు, సాధించిన పురోగతిని వివరించారు. అనంతరం డెహ్రడూన్, లక్నో నగరాల భూకంప ప్రమాదాల మ్యాప్‌ను ఆవిష్కరించారు. ఇండో గంగా మైదానంలో భవిష్యత్‌లో భూకంపాలు సంభవించే అవకాశం ఉన్న లక్నో, డెహ్రడూన్ నగరాల కోసం ఎన్జీఆర్ఐ భూకంప ప్రమాద మ్యాప్‌లను రూపొందించిందన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి జితేంద్రసింగ్‌కు పోచంపల్లి శాలువా, జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఎస్ఐఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ శేఖర్ సి.మండే, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.
తొలి రాక్ మ్యూజియం…
మిలియన్ సంవత్సరాల కాలం నాటి రాళ్ల ప్రదర్శన, వివరాలు తెలియజేసే రాక్ మ్యూజియాన్ని కేంద్రమంత్రి జితేంద్రసింగ్ ప్రారంభించారు. తెలియని అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించి, వారిని విద్యావంతులు చేయాలన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసిన 35 రకాల రాళ్లు ప్రదర్శనలో ఉంచారు. ఉపరితలం నుంచి 175 కిలోమీటర్ల లోతులో బయటపడిన రాళ్లతోపాటు, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన వాటిని ఇక్కడ అందుబాటులో ఉంచారు.