న్యూఢిల్లీ, జూలై 29: కృత్రిమ మేధ(ఏఐ) గతంలో ఎన్నడూ లేనంత వేగంగా అభివృద్ధి చెందుతున్నది. ప్రస్తుతం క్ల్లాడ్ ఫేబుల్, జీపీటీ 5.6 వంటి అత్యాధునిక ఏఐ మోడళ్లు అందుబాటులోకి వచ్చాయి. ఇవి ఎంతో శక్తివంతంగా మారడంతో, వాటిని దుర్వినియోగం చేసే ప్రమాదంపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సాంకేతిక సంస్థలు ఏఐ అభివృద్ధిలో వందల కోట్ల డాలర్లు పెట్టుబడి పెడుతున్న నేపథ్యంలో ఈ అభివృద్ధి వేగం సహజంగా తగ్గే అవకాశాలు కనిపించడం లేదు.
ఈ పరిస్థితుల్లో ఓపెన్ ఏఐ, ఆంత్రోపిక్, గూగుల్, మెటా, తదితర ప్రముఖ టెక్ కంపెనీలకు చెందిన 1,100 మందికి పైగా ఉద్యోగులు అమెరికా ప్రభుత్వానికి సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేశారు. ఏఐ అభివృద్ధి వేగాన్ని నియంత్రించే విధానాలు, పాలన వ్యవస్థ తీసుకురావాలని వారు ట్రంప్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ ప్రకటనపై సంతకం చేసిన వారిలో సీనియర్ అధికారులు, సహ వ్యవస్థాపకులు కూడా ఉన్నారు.
మరింత శక్తివంతమైన ఏఐ మోడళ్ల అభివృద్ధి విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకుని తగిన నియంత్రణలు తీసుకురాకపోతే భవిష్యత్తులో ఏఐ మనుషుల నియంత్రణ దాటి వెళ్లే ప్రమాదం ఉందని వారు హెచ్చరించారు. ఉద్యోగులు వ్యక్తం చేసిన ప్రధాన ఆందోళనల్లో ఒకటి ఆటోమేటెడ్ ఏఐ డెవలప్మెంట్. అంటే ప్రస్తుతం ఉన్న క్లాడ్ వంటి ఏఐ మోడల్, భిష్యత్తులో మనుషుల జోక్యం లేకుండానే తన తదుపరి వెర్షన్‌కు శిక్షణ ఇవ్వగల స్థాయికి చేరుకునే అవకాశం ఉందని వారు భావిస్తున్నారు. ప్రపంచంలోని ప్రముఖ ఏఐ కంపెనీలు ఏఐ పరిశోధనను పూర్తిగా ఆటోమేట్ చేసే దశకు చేరువలో ఉన్నాయని నమ్ముతున్నాయి. దీనివల్ల ఏఐ అభివృద్ధి ఎంత వేగంగా జరుగుతుందో ఇప్పుడే అంచనా వేయడం కష్టం. అయితే ఏఐ సామర్థ్యాలు మన అవగాహన, నియంత్రణ సామర్థ్యాన్ని మించి వేగంగా పెరిగే ప్రమాదం ఉంది అని ప్రకటనలో పేర్కొన్నారు.
ప్రపంచవ్యాప్తంగా టెక్ కంపెనీల మధ్య శక్తివంతమైన ఏఐ మోడళ్లను రూపొందించే పోటీ తీవ్రంగా పెరుగుతోంది. ఈ పోటీ కారణంగా భద్రతా ప్రమాణాలను పూర్తిగా అంచనా వేసేందుకు, తగిన రక్షణ చర్యలు అమలు చేసేందుకు సమయం దొరకడం లేదని ఉద్యోగులు తమ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రతి కంపెనీ, ప్రతి దేశం ఇతరుల కంటే వెనుకపడకూడదనే తీవ్రమైన పోటీ ఒత్తిడిలో ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఫ్రాంటియర్ ఏఐ అభివృద్ధి వేగాన్ని ఉద్దేశపూర్వకంగా నియంత్రించడానికి అవసరమైన సాంకేతిక, పాలనా వ్యవస్థలు ప్రస్తుతం అందుబాటులో లేవు అని వారు తెలిపారు. ఈ సమస్యకు పరిష్కారం ఏఐ అభివృద్ధి వేగాన్ని నియంత్రించడమేనని వారు భావిస్తున్నారు.