ఒకప్పుడు విహార యాత్రలంటే.. ఊటీ-కొడైకెనాల్; ఢిల్లీ-ఆగ్రా; సిమ్లా-కశ్మీర్ లాంటివే ముందువరసలో ఉండేవి. లేకుంటే.. తిరుపతి-మదురై లాంటి పుణ్యక్షేత్రాల సందర్శనకే ఎక్కువ మక్కువ చూపేది. కానీ, కాలంతోపాటు కొత్తతరంలో పర్యాటక ప్రాంతాల లిస్టూ మారింది. అందరూ చూసొచ్చిన ప్రాంతాల్లో పర్యటించే కన్నా.. కొత్త ప్రాంతాల అన్వేషణకే ‘జెన్-జీ’ అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. దాంతో, ప్రస్తుతం అంతగా ప్రాచుర్యం లేని ప్రదేశాలే.. అగ్రశ్రేణి పర్యాటక కేంద్రాలుగా మారుతున్నాయి. సంప్రదాయ యాత్రా కేంద్రాల కన్నా.. ఎక్కువ ప్రాముఖ్యతను సంతరించుకుంటున్నాయి. ఇందుకు సోషల్ మీడియా ప్రభావంతోపాటు మరిన్ని ముఖ్య కారణాలూ కనిపిస్తున్నాయి.
అంతా ‘సోషల్’ ప్రభావమే!
అంతగా ప్రాచుర్యంలేని అద్భుతాలను కనుగొనడంలో.. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ కీలక పాత్ర పోషిస్తున్నాయి. రీల్స్, షార్ట్స్‌లో వచ్చే 15 సెకన్ల సినిమాటిక్ ల్యాండ్‌స్కేప్ వీడియోలు.. వీక్షకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. ‘ఇండియాలో ఈ రహస్య ప్రాంతం ఎక్కడ ఉందో తెలుసా?’ అనే క్యాప్షన్లతో తెగ వైరల్ అవుతున్నాయి. క్షణాల్లో వేలమందికి చేరి.. ఆయా కొత్త ప్రదేశాలను సందర్శించాలనే కుతూహలాన్ని మరింత మందిలో కలిగిస్తున్నాయి.
విభిన్నంగా ఉండాలనే..
తాజ్‌మహల్ ఎదుట, గోవా బీచ్‌లో దిగిన ఫొటోలు ఇప్పుడు బోర్ కొడుతున్నాయి. అందమైన ప్రకృతి ఒడిలో, ఎవరికీ తెలియని పల్లెలోని గుడిసె ముందు దిగిన ఫొటోలకే లైక్‌లు ఎక్కువగా వస్తున్నాయి. ఇలాంటివి షేర్ చేయడానికే నేటితరం మొగ్గు చూపుతున్నారు. ఇది.. ట్రావెలర్లకు ప్రత్యేకమైన సోషల్ స్టేటస్‌ను ఇస్తున్నది. అందుకే, రొటీన్ ప్యాకేజీ టూర్లను నేటితరం ట్రావెలర్లు పూర్తిగా పక్కనపెట్టేస్తున్నారు.
ప్రశాంతత కోసం ప్రయాణం..
మెట్రో నగరాలు, పట్టణాల్లో ఉద్యోగాలు చేసేవారు.. డిజిటల్ ఫెటిగ్, బర్నౌట్‌కు గురవుతున్నారు. ఇలాంటి వారు ఎక్కువగా ప్రశాంతత కోసమే ప్రయాణాలు కడుతుంటారు. అయితే, ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో రద్దీ, ట్రాఫిక్, కాలుష్యం ఎక్కువగా ఉంటుంది. దాంతో, అక్కడికి వెళ్లినా.. ప్రశాంతత దక్కదని భావిస్తున్నారు. అందుకే, ఎలాంటి మొబైల్ నెట్వర్క్ లేని, పక్షుల కిలకిలరావాలు, ప్రకృతి శబ్దాలు మాత్రమే వినిపించే..
మారుమూల కొండ కోనల్లోకి వెళ్లేందుకే ఇష్టపడుతున్నారు.
‘సోలో’గా.. సోబెటర్గా!
ఇంతకు ముందంటే.. సకుటుంబ సపరివార సమేతంగా యాత్రలు చేసేవారు. తిరుపతి తీర్థయాత్రకో, ఢిల్లీ-ఆగ్రాలకో ప్రయాణం కట్టేవారు. కానీ, ఇప్పటితరం సోలో ట్రావెలింగే సోబెటర్ అంటున్నారు. స్నేహితులతో కలిసి బ్యాక్‌ప్యాకింగ్ చేసేస్తున్నారు. వీళ్లంతా ప్రసిద్ధ గమ్యస్థానాలకు బదులుగా.. సరికొత్త ప్రాంతాలను వెతుక్కుంటూ ప్రయాణాలు చేస్తున్నారు.
బడ్జెట్ బాధ లేకుండా..
యువతకు ఆదాయం అంతగా ఉండదు. దాంతో తక్కువ బడ్జెట్లోనే ఎక్కువ రోజులు గడపడానికి ఇష్టపడతారు. కాబట్టి, కమర్షియల్ పర్యాటక ప్రాంతాలతో పోలిస్తే.. మారుమూల ప్రాంతాల్లో బస, ఆహార ఖర్చులు చాలా తక్కువగా ఉంటాయి. హోమ్‌స్టేలు, హాస్టల్స్‌లో ఉంటూ.. విహార యాత్రలు చేస్తుంటారు.