వాషింగ్టన్, ఆగస్టు 19: విదేశాల్లో విద్య అంటే ఇంతవరకు ప్రపంచ దేశాల మెజారిటీ విద్యార్థుల గమ్యస్థానం అమెరికాగా ఉండేది. ఉన్నత ప్రమాణాల విద్యతో పాటు, ఊరించే ఉపాధి అవకాశాలు, ఆకర్షణీయమైన వేతనంతో అగ్రరాజ్యం వారిని ఆకట్టుకుంటూ ఉండేది. అయితే గత కొన్ని నెలలుగా పరిస్థితి మారిపోయింది. అమెరికా స్థానాన్ని మెల్లిగా ఇతర దేశాలు ఆక్రమిస్తున్నాయి. అంతర్జాతీయ విద్యార్థులను ఆకర్షించే పోటీలో అమెరికా తన పట్టును కోల్పోతున్నది. నవిటాస్ ఏజెంట్ పెర్సెప్షన్ సర్వే నివేదిక ప్రకారం.. ఇతర విద్యా గమ్యస్థానాలతో పోలిస్తే అమెరికా సురక్షితమైనది, ఆదరణ కలిగినది, ఆకర్షణీయమైనది అనే అనే విషయంలో విద్యార్థుల, ఏజెంట్ల అభిప్రాయాలు అంత సానుకూలంగా లేవని ఈ సర్వే వెల్లడించింది.
అమెరికా వీసా నిబంధనల కఠినతరం, వీసా ప్రక్రియలో మార్పుల నేపథ్యంలో ఈ క్షీణత నమోదైంది. కొత్త ప్రక్రియ ప్రకారం విద్యార్థి, ఎక్సేంజ్ విజిటర్ వీసా దరఖాస్తుదారుల ఆన్లైన్ చరిత్రను అగ్రరాజ్య అధికారులు పరిశీలిస్తున్నారు. అలాగే చాలావరకు నాన్ ఇమ్మిగ్రెంట్ దరఖాస్తుదారులకు వ్యక్తిగత ఇంటర్వ్యూను తప్పనిసరి చేశారు. అయితే ఈ మార్పులే అభిప్రాయం మారడానికి నేరుగా కారణం కాకపోయినప్పటికీ, ఎక్కడ చదవాలనే నిర్ణయం తీసుకునేటప్పుడు విద్యార్థులు వీసా లభ్యత, ఇతర నిబంధనల విషయంలో స్పష్టత, సరళీకరణకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు.
అమెరికాలో చదవాలన్న మోజు క్రమంగా విద్యార్థుల్లో తగ్గుతూ వస్తున్నది.ప్రపంచ వ్యాప్తంగా 64 దేశాల్లోని 870 విద్యా ఏజెంట్లపై ఈ ఏడాది మేలో జరిపిన రౌండ్ 10 సర్వేలో స్తోమత, విధానపరమైన అంశాలు, గమ్యస్థానం, విశ్వసనీయత తదితర అంశాలు విద్యార్థులను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయన్నారు. సర్వేలో పాల్గొన్న వారిలో 31 శాతం మాత్రమే అమెరికా సురక్షితమైనది, స్థిరమైన దేశంగా గట్టిగా విశ్వసించారని తెలిపింది. ఈ విషయంలో యూఎస్ ను పలు దేశాలు వెనక్కి నెట్టేశాయి. న్యూజిలాండ్ మొదటి స్థానంలో, తర్వాతి స్థానాల్లో ఆస్ట్రేలియా, యూకే, కెనడా నిలిచాయి.
వీసా విధానాన్ని నియంత్రించడంలో ఫెడరల్ ప్రభుత్వం విఫలమైందని పేర్కొంటూ విదేశీ ఉద్యోగులను నియమించుకోవడానికి హెచ్-1బీ వీసాలను ఉపయోగించకుండా రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాల డిస్ట్రిక్ట్స్ను నిరోధించే ఒక చట్టాన్ని టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబాట్ ప్రతిపాదించారు. ఆస్టిన్లో జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమం సందర్భంగా అబాట్ మంగళవారం ఈ ప్రతిపాదనను ప్రకటించారు. టెక్సాస్ ప్రభుత్వ పాఠశాలల్లో హెచ్-1బీ వీసాలపై ఉన్న ఉద్యోగుల సంఖ్య కచ్చితంగా సున్నా ఉండేలా చూసే చట్టం రావాలని ఆయన ఆకాంక్షించారు.
టెక్సాస్ ప్రభుత్వ పాఠశాల ఉద్యోగుల్లో హెచ్-1బీ వీసాదారులు ఒక్కరు కూడా ఉండకూడదని అబాట్ అన్నారు. కొంతమంది యజమానులు అమెరికా కార్మికుల స్థానంలో చౌకగా దొరికే విదేశీ కార్మికులను నియమించుకోవడానికి ఈ తాత్కాలిక పని వీసాలను వాడుకుంటున్నారని ఆరోపిస్తూ అబాట్ ఈ ప్రతిపాదనను ముందుకుతెచ్చారు. అయితే హెచ్-1బీ దరఖాస్తులను ఫెడరల్ ఇమిగ్రేషన్ అధికారులు సమీక్షించి ఆమోదిస్తారు. టెక్సాస్ విద్యారంగంలో హెచ్-1బీ ఉద్యోగాలలో అధిక భాగం విశ్వవిద్యాలయాలు, అనుబంధ ఆరోగ్య సంస్థల ద్వారా అభిస్తున్నప్పటికీ అనేక కే-12 పాఠశాల డిస్ట్రిక్ట్స్ కూడా ఉపాధ్యాయుల కొరతను తీర్చడానికి ఈ కార్యక్రమాన్ని ఉపయోగిస్తున్నాయి.