UPI | న్యూఢిల్లీ, జనవరి 1: దేశంలో ఆన్లైన్ పేమెంట్స్ జోరుగా సాగుతున్నాయి. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) లావాదేవీలు గత నెల డిసెంబర్లో 8 శాతం ఎగిసి 1,673 కోట్లుగా నమోదయ్యాయి. భారత్‌లో యూపీఐ లావాదేవీలు మొదలైన (2016 ఏప్రిల్) దగ్గర్నుంచి ఇదే అత్యధికం కావడం గమనార్హం. వీటి విలువ కూడా 8 శాతం ఎగబాకి రూ.23.25 లక్షల కోట్లకు చేరింది. నిరుడు అక్టోబర్ (రూ.23.50 లక్షల కోట్లు) తర్వాత ఇదే గరిష్ఠం. నవంబర్‌లో రూ.21.55 లక్షల కోట్లుగా ఉన్నాయి.
ఇక నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) వివరాల ప్రకారం గత ఏడాది మొత్తంగా దేశంలో 17,200 కోట్ల యూపీఐ లావాదేవీలు జరిగాయి. 2023తో పోల్చితే ఇది 46 శాతం ఎక్కువ. నాడు 11,800 కోట్లే లావాదేవీలే. విలువపరంగా చూస్తే.. రూ.183 లక్షల కోట్ల నుంచి రూ.247 లక్షల కోట్లకు పెరిగింది. దీంతో 35 శాతం వృద్ధిచెందినైట్టెంది. కాగా, నవంబర్‌తో పోల్చితే రోజువారీ లావాదేవీలు డిసెంబర్లో 51.6 కోట్ల నుంచి 54 కోట్లకు పెరిగాయి. విలువ కూడా రూ.71,840 కోట్ల నుంచి రూ.74,990 కోట్లకు ఎగిసింది. ఇదిలావుంటే ఐఎంపీఎస్ లావాదేవీలు నవంబర్‌తో చూస్తే డిసెంబర్లో 8 శాతం పుంజుకొన్నాయి.