హైదరాబాద్, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం మేడ్ ఇన్ తెలంగాణ ఆన్లైన్ మాల్‌ను అందుబాటులోకి తెచ్చింది. స్థానికంగా తయారైన వస్తువులను ఎటువంటి కమీషన్ లేకుండా విక్రయించేందుకు https:// madeintelangana.linker.store/ వెబ్‌సైట్‌ను తీసుకొచ్చింది. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా విక్రయాలు మొదలయ్యాయి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ తరహాలోనే వివిధ రకాల వస్తువులను ఇక్కడ విక్రయానికి ఉంచారు. జనవరి నుంచి పూర్తిస్థాయిలో అమ్మకాలు జరగనున్నాయి.
స్టార్టప్స్‌తోపాటు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు(ఎంఎస్ఎంఈ), ఇతర వ్యక్తిగత చిరు వ్యాపారులకు చేయూతనిచ్చే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం గ్లోబల్ లింకర్ అనే ఆన్లైన్ ప్లాట్‌ఫామ్ సహకారంతో ఈ ఆన్లైన్ మాల్‌ను ఏర్పాటుచేసింది. నవంబర్లోనే మంత్రి కేటీఆర్ దీన్ని లాంఛనంగా ప్రారంభించగా, తాజాగా క్రయవిక్రయాలను ప్రారంభించారు. ప్రస్తుతానికి చీరలు, వివిధ రకాల హస్తకళలతోపాటు రాష్ట్రంలోని పరిశ్రమల్లో తయారవుతున్న సుమారు 120 రకాల వస్తువులను అమ్మకానికి ఉంచారు. విక్రయదారులు, కొనుగోలుదారులు ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు లేకుండా తమ లావాదేవీలు చేసుకొనే వీలు కల్పించారు.
ప్రస్తుతం వెబ్సైట్లో దొరుకుతున్నవివీ..
పోచంపల్లి చీరలు, ముత్యాలు, హస్తకళలు, వరంగల్ దర్రీస్, ముత్యాల ఆభరణాలు, నిర్మల్ పెయింటింగ్స్, చేనేత వస్ర్తాలు, కలంకారీ కాటన్, హ్యాండ్ బ్యాగ్స్, హెర్బల్స్, అందం-ఆరోగ్య సంబంధిత ఉత్పత్తులు, మహిళల వస్ర్తాలు, పురుషుల వస్ర్తాలు, పిల్లల వస్ర్తాలు, మాంసం, కిరాణా వస్తువులు.
రాష్ట్ర ఉత్పత్తులకు మరింత ప్రాచుర్యం
రాష్ట్రంలో దశాబ్దాలుగా అనేక రకాల వస్తువులు తయారవుతున్నాయి. పోచంపల్లి చీరల వంటి కొన్ని వస్తువులకు మన రాష్ట్రం ప్రసిద్ధిగాంచింది. సృజనాత్మకతతో వస్తువులు ఉత్పత్తి చేసేవారికి కొదవలేదు. ఇతర కారణాల వల్ల అవి కొన్ని ప్రాంతాలకే పరిమితమయ్యాయి. ఇక్కడి ఉత్పత్తులకు ప్రాచుర్యం కల్పించి, తయారీదారులకు ప్రపంచవ్యాప్తంగా మార్కె ట్ కల్పించే ఉద్దేశంతో గ్లోబల్ లింకర్తో కలిసి డిజిటల్ మాల్‌ను ఏర్పాటు చేశాం.
-జయేశ్ రంజన్, ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి