భద్రాచలం, డిసెంబర్ 26: భద్రాచలం సీతారామచంద్రస్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. నాలుగో రోజు భద్రాద్రి రాముడు నృసింహావతారంలో భక్తులకు దర్శనమిచ్చాడు. సోమవారం ఉదయం స్వామివారికి సుప్రభాత సేవ, ఆరాధన, సేవాకాలం, ఆరగింపు, నిత్య బలిహరణం, నిత్య హోమాలు, జరిపారు. అనంతరం అంతరాలయంలోని మూలవరులకు ముత్యాలు పొదిగిన ప్రత్యేక తొడుగులను ధరింపజేశారు. ధనుర్మాసోత్సవాల్లో భాగంగా తెల్లవారుజామున శ్రీకృష్ణ పరమాత్మను, ఆండాళ్ అమ్మవారిని, స్వామివారి ఉత్సవ మూర్తులను బేడా మండపంలో ఉంచి 30 ద్రవిడ పాశురాలను విన్నవించారు. అనంతరం శాత్తుమొరై, గోష్టి తదితర కార్యక్రమాలను జరిపారు. అనంతరం యాగవీరమూర్తులకు నృసింహ అవతారాన్ని అలంకరించి బేడా మండపంలో ఉంచారు. మధ్యాహ్నం 2 గంటలకు నృసింహావతారంలో ఉన్న స్వామివారిని ప్రత్యేక పల్లకిలో బేడా మండపానికి తీసుకొని వచ్చి భక్తుల దర్శనార్థం ఉంచారు. అక్కడ ఉన్న అశేష భక్తజనం స్వామివారిని దర్శించుకున్నారు. సాయంత్రం 4 గంటలకు స్వామివారిని మేళతాళాల, వేద మంత్రోచ్ఛరణల నడుమ రాజవీధిలోని విశ్రాంత మండపానికి తీసుకొని వచ్చి భక్తుల దర్శనార్థం ఉంచారు. అక్కడ నుంచి తిరువీధి సేవగా స్వామివారిని తాతగుడి సెంటర్ వద్ద గోవిందరాజస్వామి ఆలయానికి తీసుకొని వెళ్లారు. నృసింహ అవతారంలో ఉన్న స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు రోడ్డుకు ఇరువైపులా బారులు తీరారు.
నేడు వామనావతారం
దేవతల సర్వ సంపదలను తన స్వాధీనం చేసుకున్న రాక్షస రాజైన బలి చక్రవర్తి దగ్గరకు శ్రీమన్నారాయణుడు వామన రూపంలో వెళ్లాడన్నది పురాణోక్తి. బలి చక్రవర్తి దగ్గర మూడు అడుగుల నేలను దానంగా స్వీకరిస్తాడు. ఒక్కో అడుగుకు ఒక్కో లోకాన్ని కొలిచి, మూడో పాదాన్ని బలిచక్రవర్తి శిరస్సుపై పెట్టి బలి అహాన్ని అణిచి అనుగ్రహిస్తాడు. ఈ వామనావతారాన్ని దర్శించడం వల్ల గురుగ్రహ బాధులు తొలగుతాయన్నది భక్తుల విశ్వాసం.
పర్ణశాలలో..
పర్ణశాల, డిసెంబర్ 26: పర్ణశాల దేవాలయంలోనూ వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల్లో కొనసాగుతున్నాయి. సోమవారం నాలుగో రోజు స్వామివారు నృసింహావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. తన ప్రియ భక్తుడైన ప్రహ్లాదుడిని అనేక బాధలకు గురిచేస్తున్న హిరణ్యకసివుడు అనే రాక్షసుడి సంహరించడానికి నారాయణుడు నరసింహావతారం ధరించాడన్నది పురాణోక్తి.