హైదరాబాద్, నవంబర్ 8: అంతర్జాతీయ కంపెనీలను ఆకట్టుకోవడంలో హైదరాబాద్ దూసుకుపోతున్నది. ఇప్పటికే పలు గ్లోబల్ సంస్థలు ఇక్కడ తమ కార్యాకలాపాలను విస్తరించడానికి ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోగా..తాజాగా బ్రిటన్‌కు చెందిన విద్యుత్తుతో నడిచే వాహన తయారీ సంస్థ ‘వన్ మోటో’ ఇక్కడ ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించబోతున్నట్లు ప్రకటించింది. అలాగే ముంబైలో శాఖను ఏర్పాటు చేయాలనుకుంటున్నది. భాగ్యనగరానికి చెందిన ‘ఏలిసియమ్ ఆటోమోటివ్’ స్టార్టప్‌తో కలిసి ద్విచక్ర వాహనాలను ప్రవేశపెట్టబోతున్నది. బ్రిటన్‌కు చెందిన ఈ-బైకుల తయారీ సంస్థ ఇప్పటికే మధ్య ప్రాచ్య, యూరోపియన్ మార్కెట్లో వాహనాలను విక్రయిస్తున్నది. తక్కువ ధరకే నాణ్యమైన వాహనాలను అందించడానికి సంస్థ ప్రత్యేకంగా కృషి చేస్తున్నది. ఇప్పటికే సంస్థ ప్రత్యేక డీలర్షిప్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకున్నది.
ఒకేసారి మూడు స్కూటర్లు
దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని వన్ మోటో ఒకేసారి మూడు స్కూటర్లను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది. వచ్చే జనవరి నుంచి అందుబాటులోకి రానున్న ఈ స్కూటర్లు రూ.1.20 లక్షల నుంచి రూ.1.85 లక్షల గరిష్ఠ ధరతో లభించనున్నాయి. కమ్యూటా, ఎలెక్టా, బైకా పేర్లతో విడుదల చేయనున్న ఈ స్కూటర్లలో 75 కిలోమీటర్ల రెంజ్ కలిగినది బైకా కాగా, ఎలెక్టా అత్యంత వేగవంతమైనదని పేర్కొంది. 4000 కే బాష్ మోటర్ కలిగిన ఈ స్కూటర్ 150 కిలోమీటర్ల మైలేజీ ఇవ్వనున్నది. ఈ స్కూటర్ల పనితీరును తెలుసుకోవడానికి సంస్థ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. స్మార్ట్‌ఫోన్‌లో ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకొని వ్యక్తిగత డ్రైవింగ్, గ్రీన్ కిలోమీటర్లు, జీపీఎస్, బ్యాటరీ పనితీరు, బ్యాటరీ బ్యాంక్, ఇతర విషయాలను తెలుసుకోవచ్చును.
‘భారత్‌లో వాహనాలను విడుదల చేయాలనే కల త్వరలో నెరవెరబోతున్నది. ప్రస్తు తం ఇక్కడి ఆటో రంగంలో పోటీ తీవ్రంగా ఉన్నది. అంతర్జాతీయంగా చమురు ధరలు భగ్గుమంటుండటంతోపాటు కాలుష్య నివారణ చర్యలకు ఊతమివ్వడంలో భాగంగా ఈవీల వాడకం విరివిగా పెరుగుతున్నది.
తెలంగాణలో ఈవీ రిజిస్ట్రేషన్లు 7,500
ఇంధన ధరలు ఆకాశాన్నంటిన నేపథ్యంలో ఎలక్ట్రానిక్ వాహనాల (ఈవీలు)పై మొగ్గుచూపుతున్నవారి సంఖ్య పెరుతున్నది. ఈ ట్రెండ్‌ను ప్రతిబింబిస్తూ తెలంగాణ రాష్ట్రంలో ఈ అక్టోబర్ ముగిసేనాటికి ఈవీల రిజిస్ట్రేషన్లు 7.500కు చేరుకున్నాయి. వీటిలో చాలావరకూ ద్విచక్ర వాహనాలు. మొత్తం రిజిస్ట్రేషన్లలో ద్విచక్ర వాహనాలు 5,968 కాగా, 779 కార్లు, 29 టాక్సీలు, 623 తేలికపాటి సరుకు రవాణా వాహనాలు, 44 ఆటో రిక్షాలు ఉన్నాయని అధికారులు వివరించారు.