కరోనా కొత్త వేరియెంట్ ఒమిక్రాన్ నగరానికి చేరింది. తండ్రి వైద్యం కోసం సోమాలియా నుంచి వచ్చిన యువకుడికి, వ్యక్తిగత పనిపై కెన్యా నుంచి వచ్చిన మరో యువతికి ఒమిక్రాన్ వైరస్ నిర్ధారణ అయ్యింది. మరో ఏడేండ్ల బాలుడికి నిర్ధారణ అయినా, అతడు కుటుంబసభ్యులతో కలిసి పశ్చిమబెంగాల్ వెళ్లిపోయాడు. కొత్త వేరియెంట్ సోకిన ఇద్దరిని గచ్చిబౌలిలోని తెలంగాణ
ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్)కు తరలించారు. వారిలో ఎలాంటి తీవ్ర లక్షణాలు లేవని, ఆరోగ్యం నిలకడగానే ఉందని టిమ్స్ డైరెక్టర్ డాక్టర్ విమలా థామస్ వెల్లడించారు. తండ్రి వైద్యం కోసం వచ్చిన యువకుడు నగరంలో రెండు కార్పొరేట్ దవాఖానల్లో తిరగడంతో అతని సన్నిహితులతోపాటు దవాఖాన వైద్యులు, సిబ్బందికి
నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. వీటితోపాటు ఇద్దరు నివసిస్తున్న టోలిచౌకీ, పారామౌంట్ కాలనీని వైద్య సిబ్బంది జల్లెడ పడుతున్నారు. బాధితులను కలిసిన, సన్నిహితంగా మెలిగిన వందమందిని గుర్తించివారి నమూనాలను సీసీఎంబీకి తరలించినట్లు డీఎంహెచ్‌వో వెంకటి పేర్కొన్నారు.
నగరంలో ఒమిక్రాన్ కేసులు నమోదవడంతో వైద్యారోగ్యశాఖ అప్రమత్తమైంది. అనుమానితులకు వేగంగా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నది. ప్రభావిత ప్రాంతాలైన గచ్చిబౌలి, టౌలీచౌకీ ప్రాంతాల్లో బల్దియా సిబ్బంది సోడియం హైపోక్లోరైడ్‌ను పిచికారీ చేశారు. గ్రేటర్‌వ్యాప్తంగా ప్రత్యేక బృందాలతో సిద్ధంగా ఉన్నామని, ఆరోగ్యశాఖ అధికారుల సమన్వయంతో పిచికారీ చేస్తామని బల్దియా ఎంటమాలజీ చీఫ్ రాంబాబు తెలిపారు.
ఇద్దరు విదేశీయులకు ఒమిక్రాన్ పాజిటివ్ నిర్ధారణ అయ్యిందని.. వారు ఆరోగ్యంగా ఉన్నారని.. ఒమిక్రాన్ విషయంలో ఎవరూ ఆందోళన చెందొద్దని నగర పోలీసు
కమిషనర్ అంజనీకుమార్ సూచించారు. వదంతులను వ్యాప్తి చేయొద్దని, నమ్మొద్దని హితవు పలికారు. సోషల్ మీడియాలో భయాందోళనకు గురిచేసే పోస్టులు పెడితే కేసులు నమోదు చేస్తామని సీపీ హెచ్చరించారు.
మెహిదీపట్నం, డిసెంబర్ 15: ఒమిక్రాన్ లక్షణాలు ఉన్న ఇద్దరిని గుర్తించగా టోలిచౌకిలో కలకలం రేగింది. బుధవారం పారామౌంట్ కాలనీలో 50 ఇండ్లల్లో 250 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. అంతేకాకుండా జీహెచ్ఎంసీ ఎంటమాలజీ, పారిశుధ్య విభాగం అధికారులు శానిటైజేషన్ పనులు చేపట్టారు. పరీక్షలు నిర్వహించిన వారిలో మొత్తం 250 మంది విదేశీయులేనని డాక్టర్ అనూరాధ తెలిపారు.
సిటీబ్యూరో, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ): గ్రేటర్లో ఒమిక్రాన్ పాజిటివ్ నిర్ధారణ కావడంతో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. బుధవారం గచ్చిబౌలి, టౌలీచౌకి ప్రాంతాలలో ఇంటింటికీ తిరిగి సోడియం హైపోక్లోరైట్ ద్రావణం పిచికారీ చేశారు. 30 సర్కిళ్లలో ప్రత్యేక బృందాలతో సిద్ధంగా ఉన్నామని, ఆరోగ్యశాఖ అధికారుల సమన్వయంతో స్ప్రే కార్యక్రమాన్ని జరుపుతున్నట్లు జీహెచ్ఎంసీ ఎంటమాలజీ చీఫ్ డాక్టర్ రాంబాబు తెలిపారు.
సిటీబ్యూరో, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ): ఒమిక్రాన్ విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీపీ అంజనీకుమార్ తెలిపారు. విదేశాల నుంచి వచ్చిన ఇద్దరికి ఒమిక్రాన్ పాజిటివ్ నిర్ధారణ కావడంతో వారు ఇచ్చిన చిరునామాకు వైద్య సిబ్బంది వెళ్లారని.. కెన్యా నుంచి వచ్చిన యువతికి విషయం చెప్పి ఆమెను టిమ్స్‌కు తరలించారని వివరించారు. అదే ప్రాంతంలో మరో చిరునామాలో ఉన్న సోమాలియాకు చెందిన వారు ఇంట్లో లేకపోవడంతో వైద్య సిబ్బంది ఆందోళనకు గురై పోలీసుల సహకారం కోరారన్నారు. వెంటనే రంగంలోకి దిగిన సిబ్బంది సోమాలియా నుంచి వచ్చిన వ్యక్తిని గుర్తించి వైద్య సిబ్బందికి అప్పగించారని తెలిపారు. వారి కాంటాక్స్‌ను పరిశీలించి పరీక్షలు నిర్వహిస్తామని సీపీ వెల్లడించారు.
సిటీబ్యూరో, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ): విదేశాల నుంచి నగరానికి వచ్చిన ఇద్దరికి ఒమిక్రాన్ పాజిటివ్ నిర్ధారణ కావడంతో వారిని గచ్చిబౌలిలోని టిమ్స్‌కు తరలించారు. ప్రస్తుతం అక్కడ చికిత్స పొందుతున్న వారికి ఎలాంటి లక్షణాలు లేవని టిమ్స్ డైరెక్టర్ డాక్టర్ విమలా థామస్ స్పష్టం చేశారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం పూర్తి నిలకడగానే ఉందని.. ప్రత్యేక వైద్య బృందం వారిని నిరంతరం పర్యవేక్షించడంతో పాటు అవసరమైన చికిత్స అందిస్తున్నదని ఆమె వివరించారు. 14 రోజుల పాటు బాధితులను దవాఖానలోనే ప్రత్యేక ఐసొలేషన్‌లో పెడతామని.. మరోసారి వారికి ఒమిక్రాన్ పరీక్షలు జరిపి నెగిటివ్ వస్తే డిశ్చార్జ్ చేస్తామని లేదంటే మరికొన్ని రోజులు ఇక్కడే ఉంచుతామని వివరించారు.
ఒమిక్రాన్ నేపథ్యంలో టిమ్స్‌లో పిల్లల కోసం కూడా ఏర్పాట్లు చేశారు. ఇక్కడ పిడియాట్రిషియన్లు సైతం అందుబాటులో ఉంచారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు అన్ని చర్యలు చేపట్టారు. ఒమిక్రాన్ బాధితుల సంఖ్య పెరిగితే అందుకనుగుణంగా వార్డుల సంఖ్య పెంచేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారు. ఆక్సిజన్, వెంటిలెటర్లు, అవసరమైన మందులను అందుబాటులో ఉంచారు..
ఒమిక్రాన్‌తో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని టిమ్స్ వైద్య సిబ్బంది వివరిస్తున్నారు. హైదరాబాద్‌లో ప్రస్తుతం మూడు కేసులు నమోదయ్యాయని.. ఇప్పటి వరకు ఉన్న సమాచారం మేరకు ఒమిక్రాన్ పెద్ద ప్రమాదకారి ఏం కాదని.. వైరస్ వచ్చిన వారిలో స్వల్ప లక్షణాలే కనిపిస్తున్నాయని వివరించారు. ప్రస్తుతం టిమ్స్‌లో చికిత్స పొందుతున్న వారికి ఎలాంటి లక్షణాలు లేవని వివరించారు.
టిమ్స్‌లో ప్రస్తుతం కొవిడ్, నాన్ కొవిడ్ రోగులతో పాటు ప్రత్యేకంగా ఒమిక్రాన్ రోగులకు సైతం చికిత్స అందిస్తున్నారు. మూడో అంతస్తులో ఒమిక్రాన్ రోగులు, 2వ
అంతస్తులో కరోనా రోగులకు చికిత్స చేస్తున్నారు. రోగులు ఒకరికి ఒకరు కలవకుడా అన్ని రకాల జాగ్రతలు తీసుకుంటున్నారు. ఇక సాధారణ రోగులకు నాన్‌కొవిడ్
సేవలు సైతం అందిస్తున్నారు.
సిటీబ్యూరో, డిసెంబరు 15 (నమస్తే తెలంగాణ): నగరంలో తొలిసారిగా రెండు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. తండ్రి వైద్యం కోసం సోమాలియా నుంచి వచ్చిన ఒకరు, ఇతర పనుల మీద కెన్యాకు చెందిన యువత శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు రాగా వీరికి వైద్య పరీక్షలు చేయగా ఒమిక్రాన్ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు అధికారులు తెలిపారు. మరో ఏడేండ్ల బాలుడికి ఒమిక్రాన్ నిర్ధారణ అయినా నగరంలోకి ప్రవేశించకుండానే విమానాశ్రయం నుంచే డొమెస్టిక్ ఫ్లైట్‌లో పశ్చిమ బెంగాల్‌కు వెళ్లిపోయినట్లు అధికారులు తెలిపారు. దీంతో ఒక్కసారిగా గ్రేటర్లో అలజడి మొదలైంది. ఈ సమాచారం అందుకున్న వైద్య, ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. పాజిటివ్ వచ్చిన మహిళను టోలిచౌకిలోని పారామౌంట్ కాలనీలో గుర్తించి చికిత్స నిమిత్తం టిమ్స్‌కు తరలించారు. ఆమెతో పాటు నలుగురు కుటుంబ సభ్యుల నమూనాలను సేకరించి పరీక్షలకు పంపారు. సోమాలియా నుంచి వచ్చిన వ్యక్తిని సైతం చికిత్స నిమిత్తం టిమ్స్‌కు తరలించి వైద్యం చేస్తున్నారు. మరోవైపు బాలుడి వివరాలను సైతం వెస్ట్ బెంగాల్ వైద్యాధికారులకు సైతం అందించి అప్రమత్తం చేశారు.
విదేశాల నుంచి వచ్చిన ఇద్దరికి ఒమిక్రాన్ నిర్ధారణ కావడంతో అప్రమత్తమైన వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బంది రోగుల కాంటాక్ట్స్‌పై ఆరా తీసే పనిలో నిమగ్నమయ్యారు. రోగుల కుటుంబ సభ్యులతో పాటు వారు సన్నిహితంగా మెలిగిన వంద మందిని గుర్తించి నమూనాలు సేకరించి పరీక్షల కోసం పంపినట్లు హైదరాబాద్ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జె.వెంకటి వెల్లడించారు. బాధితులు ఉన్న నివాసాలతో పాటు ఆ కాలనీ మొత్తాన్ని శుభ్రపరిచినట్లు వివరించారు. అక్కడి ప్రజలను అప్రమత్తం చేసి, కరోనా నియమాలు పాటించాల్సిందిగా అవగాహన కల్పిస్తున్నామన్నారు.
సోమాలియా నుంచి తండ్రి వైద్యం కోసం వచ్చిన వ్యక్తి నగరంలోని రెండు కార్పొరేట్ వైద్యశాలలను ఆశ్రయించాడు. అతడికి ఒమిక్రాన్ నిర్ధారణ కావడంతో అతడు కలిసిన వైద్యాధికారులకు ఒమిక్రాన్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వైద్యాధికారులు తెలిపారు.