యాదాద్రి : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రానికి అనుబంధ ఆలయంగా కొనసాగుతున్న పాతగుట్ట (పూర్వగిరి) లక్ష్మీనరసింహస్వామి వారి సన్నిధిలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిపించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 11నుంచి 17వ తేదీవరకు వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు. స్వామివారి అలంకార సేవలు ఆలయ పురవీధుల్లో ఊరేగించనున్నట్లు ఆలయ ఈవో ఎన్. గీత తెలిపారు. ఈ మేరకు యాదాద్రి ఈవో కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు.
బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ఇలా..
ఈ నెల 11వ తేదీ ఉదయం 9గంటలకు స్వస్తి వాచనంతో బ్రహ్మోత్సవాలకు అర్చకులు శ్రీకారం చుడతామని ఆలయ ఈవో గీత తెలిపారు. అనంతరం రక్షబంధనం, పుణ్యాహవాచనం, సాయంత్రం 5గంటలకు అంకురార్పణం, మృత్సంగ్రహణం, 12న ఉదయం 10 గంటలకు ధ్వజారోహణం, వేదపారాయణాలు, సాయంత్రం 6గంటలకు భేరిపూజ, దేవతాహ్వనం, హవనం, 13న ఉదయం హవనం, సింహవాహనం అలంకార సేవ, సాయంత్రం 6 గంటలకు హవనం, రాత్రి 8 గంటలకు శ్రీస్వామివారి ఎదుర్కోలు (అశ్వవాహనం) ఉత్సవం, 14న ఉదయం 8 గంటలకు హవనం, తిరుమంజనోత్సవం, హనుమంత వాహన సేవ, సాయంత్రం 6గంటలకు హవనం, రాత్రి 8గంటలకు శ్రీస్వామివారి తిరుకల్యాణోత్సవం (గజవాహనం), 15న ఉదయం 8గంటలకు హవనం, గరుడ వాహన సేవ, రాత్రి 8 గంటలకు స్వామివారి రథోత్సవం, 16న ఉదయం 10గంటలకు పూర్ణాతి, చక్రతీర్థం, సాయంత్రం 6గంటలకు దేవతోద్వాసన, శ్రీపుష్పయాగం, డోలారోహణం, 17న ఉదయం 9గంటలకు శ్రీస్వామివారి శతఘటాభిషేకం మధ్యాహ్నం ఒంటిగంటకు మహదాశీర్వచనం, పండిత సన్మానంతో ఉత్సవాలకు పరిసమాప్తి పలుకుతామని అన్నారు.
ఆలయం ముస్తాబు..
వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి ముస్తాబు చేస్తున్నారు. ఇప్పటికే ఆలయానికి రంగులు వేసి, లైటింగ్‌లను ఏర్పాటు చేశారు. స్వామివారి ఆలంకార వేడుకల్లో వినియోగించే సేవ పల్లకీలు, బెంచీలను తెలుపురంగు వేసి ఆకర్షనీయంగా తీర్చిదిద్దారు. స్వామివారి రథోత్సవం వినియోగించే రథానికి రంగులతో తీర్చిదిద్దారు. కృష్ణ శిల రాయిని తలపించే విధంగా పెయింటింగ్ వేయించారు.
మరో వారం రోజులు పాటు జరిగే ఉత్సవాలను దృష్టిలో ఉంచుకుని ఆలయంలో తాత్కాలిక విద్యుత్ దీపాలంకరణ ఏర్పాటు చేశారు. ప్రధానాలయం చుట్టు గల గోడలతోపాటు, ఆలయం బయట ప్రాంతంలో ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలు కనువిందు చేస్తున్నాయి. స్వామివారికి కల్యాణం, ఎదుర్కోలు, రథోత్సవం, ఊరేగింపులో వినియోగించే సింహవాహనం, అశ్వవాహనం, హనుమంత వాహనం, గజవాహనం, గరుడ వాహనాలను ఆలయ అధికారులు సిద్ధం చేశారు. రోజుకో వాహనంపై శ్రీస్వామి, అమ్మవార్లు ఊరేగిస్తూ భక్తుల దర్శనభాగ్యం కల్పిస్తారు.